నెక్కొండ ,సెప్టెంబర్ 26 : వరంగల్ జిల్లా నెక్కొండను మున్సిపాలిటీగా మార్చాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిన క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు జడ్పీ సీఈవో, డీపీవో జీ రామ్‌రెడ్డి పంచాయతీరాజ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీలో బుధవారం సమావేశం నిర్వహించారు.
నెక్కొండ పట్టణంతో పాటు మండలంలోని నెక్కొండ తండా, గుండ్రపల్లి, పత్తిపాక, టేకులకుంట తండా, అమీన్‌పేట గ్రామ పంచాయతీలను కలిపి నెక్కొండను మున్సిపాలిటీగా మార్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎంపీడీవో దయాకర్, వ్యవసాయాధికారి నాగరాజు, పంచాయతీరాజ్ ఏఈ, ఏపీవో జాకబ్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేందర్, నెక్కొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి సదానందంతో సమావేశాన్ని నిర్వహించి ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించాల్సిందిగా ఆదేశించారు. నెక్కొండతో పాటు విలీన గ్రామాల సమగ్ర, భౌగోళిక సమాచారాన్ని అధికార యంత్రాంగం సేకరిస్తున్నది.