Marijuana | హనుమకొండ, జూన్ 20 : గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి భారీన పడి భావి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదేశాల మేరకు నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కమిటీ సభ్యులతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం ప్రపంచానికి సామాజిక సమస్యగా పరిణమించిందన్నారు. దేశ అభివృద్ధిలో చోదక శక్తిగా నిలిచే యువత డ్రగ్స్, ఆల్కహాల్, మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని తమ శక్తి సామర్ధ్యాలు నిర్వీర్యం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల దుర్వినియోగంతో యువత వినాశనకరంగా మారుతుందన్నారు.
ఐరాస ప్రపంచ డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరపాలని 1987 నుండి ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ , మాదక ద్రవ్యాల వినియోగం అరికట్టేందుకు సభ్యదేశాల ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీచేస్తూ మాదక ద్రవ్యాల మహమ్మారికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. డ్రగ్స్ , మత్తు పదార్థాల వినియోగం, రవాణా వల్ల ఏర్పడే దుష్ఫలితాల పట్ల ప్రజలకు పౌరసమాజానికి అవగాహన చైతన్యం కలిగించడం ముఖ్య ఉద్దేశమన్నారు. జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక అవగాహన వారోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
అనంతరం మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక అవగాహన జిల్లా కమిటీ సభ్యులు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, జిల్లా సంక్షేమ అధికారి జే జయంతి, నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, సామాజిక కార్యకర్త ఈవీ శ్రీనివాసరావు, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, హోప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య, హెల్పింగ్ హ్యాండ్ డి అడిక్షన్ కేంద్రం రాము తదితరులు పాల్గొన్నారు.