హనుమకొండ చౌరస్తా : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసే ప్రధాన వేదికలుగా యువజనోత్సవాలు నిలుస్తాయని కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి ( VC Pratap Reddy ) అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) విభాగం ఆధ్వర్యంలో గురువారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో జిల్లాస్థాయి యువజనోత్సవాలు ( Youth festivals ) ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీసీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం 2047 విజన్ సాధనదిశగా ముందుకు సాగుతున్న తరుణంలో యువత పాత్ర అత్యంత కీలకమని అన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహ పెంపొందించడంలో ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ మాట్లాడుతూ జిల్లాస్థాయి యువజనోత్సవంలో 13 అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు, వివిధ కళారూపాలు, సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది విద్యార్థులకు అరుదైన అవకాశమన్నారు. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి, కేయూ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ ఇస్తారి, ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ రెహమాన్ పాల్గొన్నారు.