 
                                                            హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 31: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో యువజన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా యువజన, క్రీడాధికారి గుగులోతు అశోక్‌కుమార్ జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇందులో పాల్గొన్న విద్యార్థులకు ఏడు అంశాలలో పోటీలు నిర్వహించామని, పోటీలు వారిలో ఉన్న ప్రతిభను బయటికి తీయడానికి దోహదపడతాయని అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగపడతాయన్నారు. యువతీ యువకులు అందరూ కూడా భవిష్యత్తులో ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోని రాష్ర్ట, జాతీయస్థాయిలో సత్తా చాటాలన్నారు.
సుమారు 150 మంది విద్యార్థులకు ఏడు అంశాలలో జానపద నృత్యం, జానపద గేయాలు, వ్యాసరచన, చిత్రలేఖన, ప్రసంగం, కవిత్వరచన, ఇన్నోవేషన్ సైన్స్మేళా పోటీలు నిర్వహించామని ఇందులో విజేతలు రాష్ర్టస్థాయి పోటీలలో పాల్గొని, అందులో గెలుపొందిన వారు జనవరి 12న న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ఇందులో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలకు బహుమతులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీతలు మండల పరశురాములు, డాక్టర్ ఆకులపల్లి మధు, రాష్ర్ట అవార్డుగ్రహీత గంగోజుల నరేష్‌లను శాలువాతో ఘనంగా సన్మానించారు.
 
                            