ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జరిగిన అవినీతిపై ప్రశ్నించినందుకు ఓ యువకుడిని కాంగ్రెస్ నాయకులు వేధించారు. వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేసినందుకు బెదిరించారు. ఈ విషయాన్ని సైతం పోస్టు చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అత్యుత్సాహంతో యువకుడి ఇంటికి వెళ్లి అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని స్టేషన్ రావాలని హుకుం జారీ చేసి వెళ్లిపోయారు. దీంతో సదరు యువకుడు తనపై తప్పుడు కేసు పెట్టారని తీవ్ర మనస్తాపం చెంది సూసైట్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో గురువారం చోటుచేసుకున్నది. యువకుడి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబసభ్యులు, గ్రామస్తులు జాతీయ రహదారిపై మృతదేహంతో ధర్నా చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
– గోవిందరావుపేట, జూలై 3
గ్రామానికి చెందిన చుక్క రమేశ్(29) ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయని తెలుసుకొని అమ్మమ్మ శెట్టి విశాల వద్దకు చేరుకొని ప్రయత్నించాడు. లిస్టులో పేరు వచ్చినా ఇల్లు రాకపోవడంతో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ఇదే క్రమంలో ఇటీవల మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌పై విడుదలైన లేఖ సోషల్ మీడియాలో రాగా బుధవారం దానిని ‘చల్వాయి సమాచారం’లో రమేశ్ పోస్టు చేశాడు. దీంతో గ్రామానికి చెందిన నలుగురు కాంగ్రెస్ నాయకులు అతడితో గ్రూప్‌లో వాగ్వాదానికి దిగారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలపై పోస్టులు చేయడంతో సదరు నేతలు బుధవారం రాత్రి యువకుడి ఇంటికి వెళ్లి బెదిరించారు. ఈ విషయాన్ని సైతం గ్రూప్‌లో పోస్టు చేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో ఎస్సై ఇద్దరు కానిస్టేబుళ్లను అతడి ఇంటికి పంపించగా వారు అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఉదయం పీఎస్‌కు రావాలని చెప్పి వెళ్లారు. దీంతో రమేశ్ తీవ్ర మనస్తాపం చెంది ‘చల్వాయి గ్రామస్తుందరికీ నమస్కారాలు, నేను తప్పు చేశానని నాపై తప్పుడు కేసు పెట్టారు కొందరు. మనస్తాపంతో నేను చనిపోతున్నాను. నన్ను క్షమించండి అమ్మమ్మ, చిన్నమ్మలు’ అని సూసైట్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు
రమేశ్ మృతికి కారణమైన ముగ్గురు వ్యక్తులతో పాటు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. మృతుడి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 140/2025 కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రవీందర్ పేర్కొన్నారు.
మృతదేహంతో మూడు గంటల పాటు ధర్నా
తల్లిదండ్రులు లేని రమేశ్ మృతి చెందడంతో అతడి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబసభ్యులు, గ్రామస్తులు మృతదేహంతో జాతీయ రహదారి పై మూడు గం టల పాటు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పోరిక గోవింద్‌నాయక్, సూడి శ్రీనివాస్‌రెడ్డి, కోగిల మహేశ్, నర్సింహానాయక్, లావుడ్యవాగ, మోహన్ రాథోడ్‌తో పాటు సీపీఎం నాయకులు సోమ మల్లారెడ్డి, పొదిళ్ల చిట్టిబాబులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు.
రమేశ్ మృతికి కారకుల పేర్లు చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో పస్రా, ఏటూరునాగారం, వెంకటాపురం(నూగూరు) సీఐలతో పాటు అక్కడి ఎస్సైలు, ములుగు, తాడ్వాయి ఎస్సై సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయినప్పటికీ ఆందోళన విరమించకుండా రమేశ్ చావుకు న్యాయం జరగాలని, కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపటికి పోలీసులు వారిని శాంతింపజేసి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ములుగు జిల్లాలో ఎమర్జెన్సీ
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి
ములుగు జిల్లాలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది. ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు, ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నారు. ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ నేతలు ఉండడం ఏమిటి? అధికారులు ఏం పనిచేస్తున్నారు? ఈ విధానాన్ని ప్రశ్నించిన చుక్క రమేశ్‌ను బెదిరించడంతోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే. ప్రశ్నిస్తున్న వారిని బెదిరిస్తున్న కాంగ్రెస్ నాయకులపై కలెక్టర్‌తో పాటు ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ నాయకులకు భయపడి ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దు. రమేశ్ కాల్ డాటాను, వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నిందితులు ఏ స్థాయి నాయకులైనా కఠినంగా శిక్షించాలి.
నాగజ్యోతిని అడ్డుకున్న పోలీసులు
నిరసనగా రాస్తారోకో, బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టు
ఏటూరునాగారం : రమేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న జడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతిని స్థానిక చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బస్టాండు సెంటర్ వరకు చేరుకుని అక్కడ రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఖూనీ చేస్తుందన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. ప్రశ్నిస్తున్న వారిని బెదిరించి ఆత్మహత్యలకు కారణమవుతున్న కాంగ్రెస్ నాయకులపై కలెక్టర్, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మృతికి మంత్రి సీతక్క బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి ఇల్లు మంజూరు చేసి రూ. 25లక్షల పరిహారం అందించాలన్నారు. మంత్రి పదవి నుంచి సీతక్కను బర్తరఫ్ చేయాలని కోరారు. అనంతరం పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, తాడూరి రఘు, ఖాజాపాషా, సప్పిడి రాంనర్సయ్య, దన్నపునేని కిరణ్, కాళ్ల రామకృష్ణ, గండపెల్లి నర్సయ్య, కుమ్మరి చంద్రబాబు, జాడి భోజా రావు, మెరుగు వెంకటేశ్వర్లు, తూరం పద్మ, లక్ష్మీనారాయణ, నూతి రమేశ్, పాలకుర్తి శ్రీనివాస్, దేపాక శ్రీరాం, వావిలాల ముత్తయ్య, వావిలాల కిషోర్, మోహన్, చందా లక్ష్మీనారాయణ, ఈసం స్వరూప, బట్టు రమేశ్ పాల్గొన్నారు.
రమేశ్ మృతి కాంగ్రెస్ హత్యే
ములుగు, జూలై3(నమస్తేతెలంగాణ): ఇందిరమ్మ ఇళ్లపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ గూండాల వేధింపులతో రమేశ్ ఉరేసుకొని చనిపోవడం ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ఆ పార్టీ హత్యేనని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ములుగు దవాఖానలో ఉన్న ఆయన మృతదేహాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావుతో కలిసి సందర్శించి నివాళులర్పించారు. మృతుడి అమ్మమ్మ, సోదరి, కుటుంబసభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ హత్యకు మంత్రి సీతక్క పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.
ఈ బలిదానం మొదటి కాదని, ముగ్గురు అసువులు బాశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అర్హుల వివరాలను అడిగినందుకు, ప్రశ్నించినందుకు చాలా మంది సోషల్ మీడియా వారిని వేధింపులకు గురిచేయడం, తప్పుడు కేసులు నమోదు చేయడం, జైళ్లకు పంపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ప్రశ్నించే గొంతులను నులిమే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పోలీసులు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ గమనిస్తున్నామని, ఖబర్దార్ అని హెచ్చరించారు.
అవినీతి, అక్రమాలు, తప్పుడు కేసులు, దందాలు చేసే వారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం వచ్చిందని, మీ కార్యకర్త అధిష్టానానికి ఫిర్యాదు చేసిన లేఖను సోషల్ మీడియాలో ఫార్వడ్ చేసిన పాపానికి అమాయక యువకుడు రమేశ్ బలయ్యాడని అన్నారు. రమేశ్ కుటుంబానికి న్యాయం చేసేలా కేటీఆర్‌తో మాట్లాడతానన్నారు. కార్యక్రమంలో ములుగు, మల్లం పల్లి మండల పార్టీ అధ్యక్షులు రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, నాయకులు పోరిక గోవింద్‌నాయక్, ప్రదీప్‌రావు, పిన్నింటి మధుసూదన్‌రెడ్డి,తుమ్మల హరిబాబు, శ్రీనివాస్ రెడ్డి, దుర్గం రమణయ్య, భూక్యా జంపన్న, కోగిల మహేశ్, చీదర సంతోష్, వెంగళ్రావు ఉన్నారు.