అధికారానికి తలొగ్గిన ఖాకీల అతి ప్రవర్తనకు ఓ గిరిజన యువకుడు బలయ్యాడు. పెళ్లయి ఏడాది కూడా కాని భార్యాభర్తల నడుమ వచ్చిన చిన్న గొడవను సర్దిచెప్పి చక్కదిద్దాల్సింది పోయి, అధికార పార్టీ నేత ఒత్తిడికి తలొగ్గి ఆ యువకుడిని పోలీస్‌స్టేషన్‌లో బంధించి విచక్షణారహితంగా కొట్టడంతో దెబ్బలకు తాళలేక అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఇందుకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోకుండా ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇచ్చారే తప్ప.. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
– సుబేదారి, అక్టోబర్ 19
పాలకుర్తి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. పాలకుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపురం శివారు మేకలతండాకు చెందిన గిరిజన యువకుడు లకావత్ శ్రీను(22)కు అతడి భార్య సరోజకు మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం భార్య పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఆమె దగ్గరి బంధువుకు పరిచయమున్న అధికార పార్టీకి చెందిన స్థానిక నేత పోలీసులపై ఒత్తిడి తేవడంతో పోలీసులు శ్రీనును స్టేషన్లో బంధించి కొట్టారు. ఆ తర్వాత సరోజ దగ్గరి బంధువు కూడా స్టేషన్ ముందే శ్రీనును చితకబాదాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ పోలీసుల బెదిరింపులతో పాటు మళ్లీ కొడుతారన్న భయంతో శుక్రవారం పాలకుర్తి స్టేషన్‌కు వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. గిరిజన యువకుడి మృతి కారకులైన ఇన్స్పెక్టర్, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు, బంధువులు పెద్దఎత్తున పాలకుర్తి స్టేషన్‌కు తరలివచ్చి ధర్నా చేశారు.
దీంతో డీసీపీ స్థాయి అధికారి మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా వరంగల్ ఎంజీఎం దవాఖాన నుంచి శ్రీను మృతదేహాన్ని అంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు సొంతూరికి తీసుకెళ్తుండగా హనుమకొండ హంటర్‌రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. అయితే, పాలకుర్తిలో పరిస్థితి అదుపులోనే ఉండడంతో హంటర్‌రోడ్డు నుంచి శ్రీను మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి పోలీసు ఉన్నతాధికారులు అనుమతించారు.
గిరిజన యువకుడిని స్టేషన్లో బం ధించి విచక్షణారహితంగా కొట్టి, అతడి ఆత్మహత్యకు కారకులైన పాలకుర్తి పోలీ సు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్య మరింత జఠిలం కాకుండా ఆర్థికంగా ఆదుకుంటామని మృతుడి కుటుంబానికి హామీ ఇచ్చారు తప్ప.. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదని గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు తలొగ్గి, సామాన్యులపై ప్రతాపం చూపిస్తారా అని మండిపడుతున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కొందరు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు తమ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు అంటకాగుతున్నారు. వారు చెప్పినట్లు నడుచుకుంటూ సామాన్యులపై కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పోలీసు శాఖ పరువును తుంగలో తొక్కుతున్నారు. ఇటీవల వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఓ పోలీసు అధికారి వైఖరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, తాజాగా, పాలకుర్తిలో గిరిజన యువకుడి ఆత్మహత్యకు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పరకాల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులను నిర్బంధించి కొట్టిన కేసులో పోలీసు అధికారులపై విచారణ జరుగుతుండగానే, కొందరు పోలీసు అధికారులు బాధితులను బెదిరిస్తున్నా ఎలాంటి పట్టింపు లేదు. కొందరు ఏసీపీ, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పోలీస్ శాఖ నిబంధనలు అతిక్రమించి, ఉన్నతాధికారుల ఆదేశాలను తుంగలో తొక్కి పోస్టింగ్ ఇప్పించిన అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సివిల్ వివాదాలు, కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని, బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.