ఖిలా వరంగల్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చారిత్రక ఓరుగల్లు కోటలో యోగా పరిమళం గుబాలించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. జ్యోతి ప్రజ్వలన చేసి యోగా డే వేడుకలను ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు, జిల్లా అధికార యంత్రాంగం, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో యోగా గురువు అమృతవల్లి ఆసనాలు వేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చారిత్రక ప్రదేశాల్లో యోగా చేయడం మన సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా కేవలం వ్యాయామమే కాకుండా మన ప్రాచీన ధ్యాన సాంప్రదాయానికి నిదర్శనమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సోమ్ లాల్, 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, కేంద్ర పురావస్తు శాఖ ఏఈ కిషోర్ రెడ్డి, జిల్లా అధికారి నవీన్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, జడ్పీ సీఈవో రామిరెడ్డి, డీఆర్డీవో పీడీ కౌసల్యాదేవి, డీపీఆర్వో అయూబ్ అలీ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పలత, డీఏవో ఫణికుమార్, ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.