హనుమకొండ, నవంబర్ 18 : అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలేమయ్యాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అబద్ధపు హామీలు, మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలను మోసం చేసింది.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు మహిళలకు రూ. 2500లు, తులం బంగారం, స్కూటీలు ఇచ్చావా… దేనికి విజయోత్సవ సభ పెడుతున్నాడో రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. గత సీఎం కేసీఆర్ పాలనలో శంకుస్థాపనలు చేసిన పనులను తామే చేశామంటూ సిగ్గుఎగ్గులేకుండా ప్రారంభిస్తున్నారని విమర్శించారు. మహిళా సంఘాలకు రూ. 90వేల కోట్ల రుణాలు అందజేసి నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రగల్బాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి దమ్ముంటే కోటీశ్వరులైన మహిళలను సభలో సన్మానించాలని డిమాండ్ చేశారు.
గతంలో కాంగ్రెస్ పాలనలో రైతు ఎంత గోసపడి ఎట్లా ఉండేటోళ్లు?, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఇప్పుడు మళ్లీ ఎంత ఇబ్బందులు పడుతున్నారో వారిని అడిగితే తెలుస్తుందన్నారు. అప్పుడు ప్రతి వడ్ల గింజనూ కొనుగోలు చేస్తే, ఇప్పుడు రోడ్లపై, కల్లాల్లో ధాన్యం ఉండిపోయిందన్నారు. సభలో ప్రతి జిల్లాకో మహిళా సమాఖ్య భవనమని వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తున్న డబ్బులు ప్రభుత్వానివి కాదని, సంఘాలు సంపాదించిన డబ్బులతో అన్నీ చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలోనే వాళ్లు స్వశక్తితో భూములు కొనుగోలు చేశారని అన్నారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, వాసుదేవారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు బీరెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, నయీముద్దీన్, బండి రజిని, పోలపల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి ఏం సాధించారని విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారో చెప్పాలి. ఏడాది కాలంలో 600 మందికి పైగా రైతులు చనిపోయినందుకా?, 130 మంది మహిళలపై అత్యాచారాలు జరిగినందుకా?, 87 మంది ఆటోడ్రైవర్లు, 26 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా?, రైతుబంధు రాక, రుణమాఫీ కాక, రైతుబీమా అందక, బోనస్ ఎగ్గొట్టినందుకా?, తులం బంగారం ఇవ్వనందుకా?, స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను గోస పెడుతున్నందుకా?, మూసీ బాధితుల ఇండ్లు కూలగొట్టినందుకా?, హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి కుటుంబాలను రోడ్డుపై పడేసినందుకా?, ఉద్యోగులకు 5 డీఏలు ఇవ్వనందుకా?,
అల్లుడి కోసం భూములు ఇవ్వని లగచర్ల గ్రామస్తులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలులో పెట్టినందుకా?.. ఇలా ఏమి చేశారని విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. వరంగల్‌ను హెల్త్ సెంటర్‌ను చేయాలనే సంకల్పంతో కేసీఆర్ రూ. 1500 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి 80 శాతం పూర్తి చేయగా, మిగిలిన పనలును ఎందుకు పూర్తి చేయడం లేదు?. మార్చి వరకు గడువు ఇస్తున్నాం. అప్పటి వరకు పూర్తి చేయకపోతే మేమేంటో చూపిస్తాం. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఏమైంది?. రూ. 30కోట్లతో భద్రకాళి మాడవీధులు నిర్మాణం చేపడితే ఇప్పటి వరకు రూ. 8కోట్లకే టెండర్లు పూర్తి చేశారు. మంత్రుల నియోజక వర్గానికి ఒక ఎమ్మెల్యే పోడు.. ఎమ్మెల్యేల నియోజకవర్గానికి మంత్రులు పోయే పరిస్థితి లేదు. రేపటి సభలో మహిళలకు మీరు ఏమి చేశారో నిలదీసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.
కాళోజీ ఆత్మ ఘోషిస్తుంది
గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళోజీ కళాక్షేత్ర నిర్మాణానికి 300 గజాల స్థలం ఇవ్వలేదు. ఇప్పుడు మేము చేశామనడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో 4ఎకరాల విస్తీర్ణంలో రూ.75 కోట్లతో కాళోజీ కళాక్షేత్ర నిర్మాణం చేపట్టి 95 శాతం పనులు పూర్తి చేశాం. వివిధ కారణాలతో పనులు ఆగిపోగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తామే నిర్మాణం చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నది. కొత్తవి చేసే చేవ లేక పూర్తి కావచ్చిన వాటిని వారి ఖాతాలో వేసేందుకు నాటకాలు ఆడుతున్నది. తెలంగాణవాదులపై తుపాకులు ఎకుపెట్టిన వారు కాళోజీ కళా క్షేత్రాన్ని ప్రారంభిస్తుంటే కాళోజీ ఆత్మ ఘోషిస్తుంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బూటకపు ఎన్కౌంటర్లపై కాళోజీ గళం విప్పారు. ఆయన బతికి ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు పెట్టారు. మరణించిన తర్వాత గుర్తింపు ఇవ్వలేదు.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం
కాళేశ్వరం వల్లనే ఈ రోజు వ్యవసాయ రంగానికి గుర్తింపు వచ్చింది. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించిన మహనీయుడు కేసీఆర్. సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన చిన్నచిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి కాంగ్రెస్ చూపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలి రెవెన్యూ తగ్గింది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్‌లో బంధుప్రీతి పెరిగింది. అనాలోచిత విధానాలకు తెరదించి, కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా న్యాయమైన పాలనపై దృష్టి పెట్టాలి.
కాంగ్రెస్ పాలనలో ఎస్సీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదు. మంత్రి వర్గంలో సామాజిక న్యాయమేది?, 2 ఎంపీలు కూడా మాలలకే ఇచ్చారు. విదేశాల్లో చదివే పిల్లలకు ఓవర్సీస్ సాలర్ షిప్స్ రావడం లేదు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి బైండ్ల అని, ఎస్సీ అని, బీసీ అని చెప్పుకున్నడు. ఈ కులగణనలో ఏ కులం రాపిస్తాడో చూడాలి. కడియం దియా నజీర్ అని తన మనుమరాలు పేరు పెట్టుకొని రాజకీయ వారసత్వాన్ని ప్రకటించాడు. బీఆర్ఎస్లో అన్ని పదవులు అనుభవించిన శ్రీహరి పార్టీని మోసం చేశాడు. బీఆర్ఎస్ పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత పార్టీ మారాడు. బీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలి.
– మాజీ ఎమ్మెల్యే తాటికొండ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గిరిజనులకు అండగా నిలిచారు. తండాలను గ్రామ పంచాయతీలుగా, రిజర్వేషన్‌తో పాటు పోడు రైతులకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే. సీఎం రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ఆయన లేబరా.. గూండానా, రౌడీనా అర్థం కావడం లేదు. లగచర్లలో తుపాకులతో మా లాంబాడీలను బెదిరిస్తున్నారు. మేము తుపాకులకు బెదిరే వాళ్లం కాదు. అడవిలో పుట్టి అడవిలో పెరిగాం. ఓరుగల్లు గడ్డ మీద కాలు పెట్టే ముందు లగచర్ల రైతులను బేషరతుగా విడుదల చేయాలి. రేపటి సభకు మేం ఏ వేషంలో ఎకడికి వస్తామో చూసుకో బిడ్డా రేవంత్ రెడ్డి?
– మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్
ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఆర్పీలకు సైతం జీతాలు ఇవ్వలేని దరిద్రం. చేనేత బీమా, వరంగల్ బస్టాండ్ గురించి అడగలేని చేత కాని మంత్రి వరంగల్‌లో ఉన్నారు. ఎంఎన్ నగర్, సంతోషి మాత గుడి దగ్గరి ప్రజలకు గత ప్రభుత్వం పట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వం నోటీస్‌లు ఇచ్చింది. మాస్టర్ ప్లాన్ సంవత్సరం క్రితం నుంచే నగరంలో అమలతున్నది. ఎయిర్ పోర్ట్ విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ మే ముందుకు సాగింది. రాబోయే మున్సిపల్,గ్రామపంచాయతీ ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
– మాజీ ఎమ్మెల్యే నన్నపునేని
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ చొరవతోనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేశాం. వస్త్ర పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు లక్షా యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గతంలోనే 1350 ఎకరాల భూసేకరణ చేశాం. లగచర్ల భూసేకరణలో రాద్ధాంతం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి రైతులపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నాడు. మా ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు పత్రాలు మీరిచ్చారు. సంవత్సర కాలం గా మెగా టెకెస్టుల్ పార్కు ఒక కంపెనీ కూడా తీసుకరాలేక పోయారు. వస్త్ర పరిశ్రమలో నూతనంగా ఏర్పాటైన కంపెనీలు ఎందుకు ప్రారంభం కావడం లేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందని సంబురాలు జరుపుతారు. రేపు జరగబోయే సభలో సీఎం రేవంత్ రెడ్డిని మహిళా రైతులు నిలదీస్తారు. ఇప్పటికే కాంగ్రె స్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితులు లేవు.