నర్సంపేట, మే18: తాగునీటి ఎద్దడిని(Drinking water) నివారించాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి జీపీ పరిధిలోని నర్సింగాపురంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సింగాపురంలో సుమారు 550 జనాభా ఉంది. గ్రామంలో బావి, బోరు మాత్రమే ఉన్నాయి. స్థానిక ప్రజలకు తాగునీరు సరిపోవడం లేదు.
మధ్యకాలనీ (మద్దెవాడ) ప్రజలంతా బోరుపైనే ఆధారపడ్డారు. ఇక్కడ 30 కుటుంబాలకుపైగా జీవనం కొనసాగిస్తున్నాయి. నెల రోజులుగా నల్లా నీళ్లు సరిగ్గా రావడం లేదు. మరోవైపు బోరు రిపేరుకు రావడం, మిషన్‌భగీరథ నీరు రాకపోవడంతో ఆదివారం పలువురు మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.