గిర్మాజీపేట/వరంగల్‌చౌరస్తా, మార్చి 8: వరంగల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం మహిళలను ఘనంగా సత్కరించారు. శివనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో మహిళా కార్పొరేటర్లు, మహిళా పారిశుధ్య కార్మికులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ముష్కమల్ల అరుణ, పల్లం పద్మ, దిడ్డి కుమారస్వామి, బీఆర్ఎస్ నేత ముష్కమల్ల సుధాకర్, నాయకులు పాల్గొన్నారు. 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన మహిళా పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు. బీఆర్ఎస్ నేత గందె నవీన్ పాల్గొన్నారు. 33వ డివిజన్లోని శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ 15 మంది మహిళలను సత్కరించారు. 36వ డివిజన్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్‌ను చింతల్ కమ్యూనిటీ హాల్లో డివిజన్లోని మహిళలు సత్కరించారు. అనంతరం డివిజన్ అధ్యక్షురాలు నరిశెట్టి లావణ్యతోపాటు డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా శానిటేషన్ సిబ్బంది, కంటి వెలుగు, ఆశ వర్కర్లను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకుడు మసూద్, డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాకయ్య పాల్గొన్నారు. గిర్మాజీపేట 27వ డివిజన్ పరిధిలోని బాపూజీ విజ్ఞానకేంద్రంలో కార్పొరేటర్ అనిల్‌కుమార్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మితోపాటు మెప్మా జిల్లా అధ్యక్షురాలు లక్క ధనలక్ష్మి తదితరులను సన్మానించారు. వరంగల్ సీకేఎం హాస్పిటల్ ఓపీ విభాగంలో డాక్టర్ నిర్మలాకుమారి కేక్ కట్ చేశారు. గైనకాలజిస్ట్ డాక్టర్ బేతి కవిత పాల్గొన్నారు.
కరీమాబాద్: వరంగల్ 32, 39, 40, 41, 42, 43వ డివిజన్లో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన, ఈదురు అరుణ ఆధ్వర్యంలో పలువురు మహిళలను సత్కరించారు. 42వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కేడల పద్మ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కరీమాబాద్‌లోని అంబేద్కర్‌నగర్‌లో రమాబాయి అంబేద్కర్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తరాల రాజమణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఉర్సు రంగలీలా మైదానంలో మహిళా వాకర్లను సత్కరించారు. అలాగే, ఉర్సు బైపాస్ రోడ్డులోని తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ పాఠశాలలో చైర్మన్ తాళ్ల మల్లేశం ఆధ్వర్యంలో చిన్నారులు మహిళా మహనీయుల వేషధారణలో ఆకట్టుకున్నారు. విద్యానగర్‌లోని చాణక్య పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు అచ్చ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో రాణీరుద్రమ, ఇందిరాగాంధీ వేషధారణలతో జాతీయ జెండాలను పట్టుకొని పిల్లలు అలరించారు. రంగశాయిపేటలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభిమాన నారీమణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
ఖిలావరంగల్/కాశీబుగ్గ: ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించారు. మహిళలకు పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఖిలావరంగల్ 37, 38 డివిజన్లలో కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ కేక్ కట్ చేసి పారిశుధ్య కార్మికులను సన్మానించారు. శివనగర్, ఆదర్శనగర్, గాడిపల్లి, వసంతపురం, బొల్లికుంట, దూపకుంట ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు మహిళలను సత్కరించారు. శివనగర్‌లోని సీపీఐ కార్యాలయంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. వరంగల్ పైడిపల్లిలోని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం బలరాం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తాము ఆలోచించే విధానాన్ని మార్చుకుంటే మహిళలకు సమానత్వం లభించినట్లేనన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులు స్మార్ట్ఫోన్లలో రక్షణ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మహిళాలను సత్కరించారు. 19వ డివిజన్ నర్సంపేటరోడ్డులోని సంరక్ష సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మహిళా వైద్యులు, సిబ్బందిని సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ వేముల ఉషశ్రీ, డాక్టర్ రామ తులసి పాల్గొన్నారు. 18వ డివిజన్లో మహిళా పారిశుధ్య కార్మికులు, ఆర్పీలు, ఆశ వర్కర్లను సత్కరించారు. కార్పొరేటర్ బాబు, మాజీ కార్పొరేటర్ రాజేందర్ పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: పలు డివిజన్లలో మహిళలను సన్మానించి, పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. 22వ డివిజన్లో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, బీఆర్ఎస్ ఇన్చార్జి మావురపు గీత విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లను సన్మానించారు. 23వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేరెళ్ల శోభావతితోపాటు పలువురు మహిళలను సత్కరించారు. కొత్తవాడలో నీలం రాజ్‌కిశోర్ ఆధ్వర్యంలో ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య పోరాట సమితి అధ్యక్షుడు గుండా ప్రభాకర్ గుప్తా ఆధ్వర్యంలో 80 ఫీట్ల రోడ్డులో పారిశుధ్య కార్మికులకు చీరెలు పంపిణీ చేశారు. ఆటోనగర్‌లోని లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాలలో నిర్వాహకురాలు నలివెల కల్యాణి, ఉపాధ్యాయులు హైమావతి, మానసను వాసవీ క్లబ్ ప్రతాపరుద్ర హనుమకొండ ఆధ్వర్యంలో సన్మానించారు.
వరంగల్: భద్రకాళి ఆలయంలోని మహిళా ఉద్యోగులను సన్మానించారు. ఈవో శేషుభారతితోపాటు మహిళా ఉద్యోగులను ప్రధాన అర్చకుడు శేషు శాలువాలతో సత్కరించారు. స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు హరినాథ్, కృష్ణ, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.