పర్వతగిరి, నవంబర్ 28 : నిరుపేద మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడానికి స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని వరంగల్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ పీ డేవిడ్‌రాజ్ అన్నారు. సోమవారం ఎఫ్‌ఎమ్‌ఎమ్ సాంఘిక సేవా సంస్థ వరంగల్ సహకారంతో పర్వతగిరిలో నూనె స్వప్న ఏర్పాటు చేసుకున్న కిరాణా షాపును సంస్థ డైరెక్టర్ సిస్టర్ రెజీనా చిన్నప్పతో కలిసి ఏసీపీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలంగా లేకపోవడంతో కుటుంబ పోషణ, పిల్లల సంరక్షణ సమస్యగా మారిందని, ఎఫ్‌ఎమ్‌ఎమ్ సాంఘిక సేవా సంస్థ ముందుకు వచ్చి పేద మహిళలకు ఆర్థికసాయం అందించి స్వయం ఉపాధి కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో సేవా సంస్థ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ బత్తుల కరుణ, ప్రాజెక్టు అధికారి ఎర్ర శ్రీకాంత్, ఫీల్డ్ ఫెసిలిటేటర్ ఎం రాజ్యలక్ష్మి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.