కమలాపూర్, జనవరి 27 : మహిళ కూలీలు పనులకు వచ్చి.. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన సోమవారం అంబాల-గూడూరు గ్రామాల మధ్య జరిగింది. హసన్‌పర్తి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన మౌలానాబీ, షకీనా, ఆసియా, సఫియా, కరీమా, షమీబీ, షేక్ అబ్దుల్లా, ముంతాజ్‌బేగం, మైమునాబీ, కరీనాబీ, సమీనాబీ, గౌసియా, రంజాన్, రఫియా, అంకూస్‌బీ, మౌలానీ, సఫియా, అస్మా, సయ్యద్ గౌసియా, గరీమ్బీ, కమాలీ, హుస్సేన్‌బీతో పాటు మరో ఇద్దరు మహిళలు కూలి పనుల కోసం ఆటో ట్రాలీలో మండలంలోని వంగపల్లి గ్రామానికి వచ్చారు.
పనులు ముగించుకుని ట్రాలీలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. గూడూరు-అంబాల గ్రామాల మధ్య హనుమకొండ నుంచి కమలాపూర్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు, హసన్‌పర్తి వెళ్తున్న ఆటో ట్రాలీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో ట్రాలీ బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న 24మంది మహిళ కూలీలు కింద పడిపోయారు.13మందికి తీవ్రగాయాలు కాగా 9మందికి స్వల్పగాయాలయ్యాయి. అందు లో హుస్సేన్‌బీ (45)మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
కూలీల అర్తనాదాలతో రోడ్డుపై భీతావహ వాతావరణం నెలకొంది. అరగంట పాటు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, ప్రజలు వెంటనే స్పందించి బోల్తాపడిన ట్రాలీ కింద, డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయిన మహిళలను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న సీఐ హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కమలాపూర్, హసన్‌పర్తి, నడికూడ, హనుమకొండకు చెందిన 108 వాహనాల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ భానుకిరణ్, డిపో మేనేజర్ ధరమ్‌సింగ్, కాజీపేట ఏసీపీ తిరుమల్, చేరాలు పరిశీలించారు. కాగా, రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందడంతో పాటు పలువురు గాయపడడంతో హసన్‌పర్తి మండలంలోని మునిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది.