జనగామ, మే 10 (నమస్తే తెలంగాణ) : ఝూటాకోర్ మాటలతో నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ నమ్మితే మోసపోవుడేనని.. ఎంపీ ఎన్నికల్లో ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశానికి మద్దతుగా జనగామ ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘బస్సు ఫ్రీ, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం, రైతులకు రూ.15వేలు, ఆడబిడ్డలకు రూ.2,500, పింఛన్ రూ.4వేలు, రూ.2లక్షల రుణమాఫీ, ధాన్యానికి రూ.500 బోనస్’ అంటూ రేవంత్‌రెడ్డి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని, అవన్నీ అమలయ్యాయా.. అని ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లక్షన్నర మంది ఆడబిడ్డల పెండ్లిళ్లు అయినయి.. అంటే రేవంత్‌రెడ్డి లక్షన్నర తులాల బంగారం ఆడపిల్లలకు బాకీ ఉన్నాడని అన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని దద్దమ్మలు ఏ మొఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
ఊసరవెల్లి సిగ్గుపడేలా రుణమాఫీపై రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని, పంద్రాగస్టుకు తప్పకుండా చేస్తానని దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ కొత్త హామీలు ఇచ్చేముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకానందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్లు కారు గుర్తును మరిచిపోవద్దన్నారు. క్యామ మల్లేశంను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జనగామ మార్కెట్లో రైతులు అరిగోస పడ్డరు.. ముఖ్యమంత్రి చెప్పినా ధాన్యానికి ముష్టి 30 రూపాయలు పెంచారు.. నేను చెప్పితే రూ.400 పెంచారు.. కావాల్సిన నీళ్లు, కరెంట్ ఉన్నా కూడా రిజర్వాయర్లలో నీళ్లు నింపలేని అసమర్థ, చేతకాని ప్రభుత్వం వల్ల పంటలు ఎండిపోయాయని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వచ్చాక పథకాలన్నీ గోవిందా.. సైకోగాళ్లు, రాక్షసులే పేగులు తీసి మెడలో వేసుకుంటారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నది.. వాళ్లూ మేము ఒక్కటైతే కవిత అరెస్టు అయ్యేనా? ప్రజలు ఆలోచించాలన్నారు. బీజేపీ బడా కార్పొరేట్ సంస్థల గురించి మాత్రమే ఆలోచించిందని, రూ.14లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేసిందని, పేదలకు మాత్రం ఒక రూపాయి కూడా మాఫీ చేయకపోగా నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల ఉసురు పోసుకుందన్నారు.
కొమ్మూరిని ప్రజలు ఛీ కొట్టారు
‘జనగామ ప్రజలు ఛీకొట్టిన వ్యక్తి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి.. ఆయన నన్ను దొంగఓట్లతో గెలిచాడని గోబెల్స్ ప్రచారం చేస్తున్నడు.. గతంలోనూ పొన్నాల లక్ష్మయ్యపై ఇదే రకమైన ప్రచారం చేసిండు.. మీ ఊర్లో.. మీ వార్డులో ఎవరైనా దొంగఓట్లు వేశారా? చెప్పండి..’ అంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రజలను ప్రశ్నించారు. ప్రతిరోజు జనగామలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తన సొంత దవాఖానలో ఇప్పటికే 6500మందికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే కాకముందే జనగామ పట్టణానికి రూ.కోటి నిధులు తెచ్చానని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే మరో రూ.25కోట్ల నిధుల జీవో తెచ్చిన.. తాను తెచ్చిన నిధులకు టెండర్ అయిందన్నారు. ఎన్నికల తర్వాత పనులు ప్రారంభమవుతాయన్నారు. ప్రజల మధ్యే ఉంటా.. ప్రభుత్వంతో కొట్లాడి పనులు తీసుకొస్తా.. నేను గడ్డిపోసను గట్టిపోసను అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఒంటిపై బట్టలు మార్చినట్లు పార్టీలు మార్చి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరికి పిచ్చి పట్టిందని, సిగ్గూశరం లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బీసీ బిడ్డ క్యామ మల్లేశం పేదల కష్టాలు తెలిసిన మనిషని భారీ మెజార్టీతో ఆయనను గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ 12 సీట్లు గెలవబోతున్నదని, బీజేపీకి ఒక సీటు కూడా రాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, కౌన్సిలర్లు కర్రె శ్రీనివాస్, బండ పద్మ, అనిత, సుధ పాల్గొన్నారు.