దేవరుప్పుల, డిసెంబర్ 14 : గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పి, హామీ ఇచ్చిన గ్యారెంటీలు వాయిదా వేస్తారా? కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసింది అన్ని వర్గాల సంక్షేమం కోసమే. సాగునీరు, తాగునీరు, కరెంటు కోసం అప్పులు చేశారు. తీర్చే సత్తా తెలంగాణకు ఉంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోగా గత ప్రభుత్వం అప్పుల పేర తాత్సారం చేయడం తగదు’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో గురువారం బీఆర్ఎస్ మండల స్థ్ధాయి శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎన్నికల ముందు తాము గెలవగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, తీరా గత ప్రభుత్వం అప్పులు చేసిందని సాకు చూపడం సరికాదన్నారు. ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేసి, మాట నిలబెట్టుకోవాలన్నారు. ప్రజలు హామీలు చూసి ఓట్లేశారని, వాటి అమలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రైతులు తమ ధాన్యానికి అదనంగా రూ.500 వస్తుందని ఎదురు చూస్తున్నారని, అదనంగా రైతు బంధు పడుతుందని చూసి నిరాశపడ్డారన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి తప్పు చేశామనే భావన ప్రజల్లో వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇదే ధోరణి ప్రదర్శిస్తే ప్రజల తిరస్కారానికి గురికావడం ఖాయమని పేర్కొన్నారు.
పాలకుర్తి ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తాను నిస్వార్థంగా ప్రజా సేవ చేశానని, ఎవరినీ మోసం చేయలేదన్నారు. కక్షసాధింపు లేదన్నారు. కమీషన్లు తీసుకోలేదన్నారు. లంచాలు అడగలేదన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్థ్ది పథంలో నిలిపినట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చానని చెప్పారు. అన్ని పార్టీల నాయకులు తన వద్దకు వచ్చి పనులు చేయించుకున్నారన్నారు. ఒక విజన్‌తో ముందుకు పోయానని, ఇక్కడ జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడా జరగలేదన్నారు. అయినా ప్రజలు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమికి సవాలక్ష కారణాలున్నాయని, దాన్ని స్వీకరిస్తున్నానని అన్నారు. ఓడినా కార్యకర్తల వెన్నంటే ఉండి, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని అన్నారు. వారానికోసారి వచ్చిపోతానని మాజీ మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కాగా, పాలకుర్తి అభివృద్ధికి తాను సహకరిస్తానని చెప్పారు. నియోజకవర్గంలోజరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాలన్నారు. ఇప్పటికే మరో రూ.500 కోట్ల అభివృద్ధి పనులు మంజూరై ఉన్నాయన్నారు. వాటిని పూర్తి చేసే బాధ్యతను తీసుకోవాలన్నారు. ఇక మరో సారి గ్రామస్థాయిలో సమావేశాలు పెట్టి కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. తాను వచ్చే సారి కూడా ఇక్కడే నిలబడుతానని ఎర్రబెల్లి అన్నారు. అనంతరం గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించి, కార్యకర్తల్లో ధైర్యం నింపారు. కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు తీగల దయాకర్, నాయకులు పల్లా సుందర్‌రాంరెడ్డి, బస్వ మల్లేశ్, కొల్లూరు సోమయ్య, ధరావత్ రాంసింగ్, చింత రవి పాల్గొన్నారు.