కాజీపేట, పిబ్రవరి 5 : కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ విశాఖపట్నంను రైల్వే డివిజన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌గా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్ హోదా దక్కుతుందనే ఆశలు ఈ ప్రాంత ప్రజల్లో చిగురిస్తున్నాయి. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో పలు రైల్వే డివిజన్లలోని ఎల్లలు, హద్దులు మారనుండడంతో తాజాగా సికింద్రాబాద్ రైల్వే డివిజన్ విస్తీర్ణం మరింత పెరుగనున్నది. గతంలోనే కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని కాజీపేట నుంచి మాణిఘర్, పెద్దపల్లి నుంచి నిజామాబాద్, కాజీపేట-కొండపల్లి, డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్డు, మణుగూరు, భద్రాచలం రోడ్డు నుంచి సత్తుపల్లి వరకు రైల్వే విస్తీర్ణం ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు విశాఖ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి వెల్లడంతో అన్ని అర్హతలున్న కాజీపేట రైల్వే డివిజన్ హోదాకు నోచుకుంటుందని, తమ చిరకాల వాంఛ తీరుతుందని ఇక్కడి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మహా కుంభమేళాకు వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట, ఫిబ్రవరి 5 : మహా కుంభమేళాను పురస్కరించుకుని వరంగల్ స్టేషన్ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లను మచిలీపట్నం-దానాపూర్-మచిలీపట్నం మధ్య నడుస్తుందన్నారు. ఈ నెల 8, 16వ తేదీన నంబర్ 07113తో మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 11.00కు బయలుదేరే రైలు మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుంది. తిరిగి ఈ నెల 10, 18 తేదీల్లో 07114 నంబర్‌తో దానాపూర్‌లో మధ్యాహ్నం 3.15కు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 3.00 గంటలకు మచిలీపట్నం స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్ స్టేషన్లలో ఆగుతాయని, వీటికి కేవలం 3 ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయన్నారు. రిజర్వేషన్ పక్రియ మొదలైందని, కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.