పాలకుర్తి రూరల్, జూన్ 19: ‘నేను పార్టీ మారుతానని కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు.. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా’నని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. బుధవారం వరంగల్ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో పాలకుర్తి నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పార్లమెంట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలంగాణ రాష్ర్టానికి మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పాలకుర్తి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ చిన్న తప్పు చేయలేదన్నారు. తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
సోషల్ మీడియా ప్రచారాన్ని నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఖండించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందన్నారు. రైతుభరోసాకు దిక్కులేదని, పంట రుణమాఫీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఆచరణలో విఫలమయ్యారని ఎర్రబెల్లి మండిపడ్డారు. విద్యుత్ కోతలతో రాష్ట్రం చీకటి మయమైందని, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ధ్వజమెత్తారు. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ప్రజలకు మంచి చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్, అధినేత కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను, తప్పుడు పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.