‘పోలీసులను చూస్తే దొంగలు, రౌడీలు భయపడాలి కానీ.. ఇక్కడ మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. అధికారం అండతో రెచ్చిపోతున్న రౌడీలు, మాజీ రౌడీషీటర్లు ఏది చెబితే అదే శాసనం అన్నట్టు కొందరు ఖాకీలు జీ హుజూర్ అంటూ సామాన్యులపై ప్రతాపం చూపుతున్నా పోలీస్ కమిషనర్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంపై అధికార పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ మేరకు ఇటీవల జరిగిన పరిణామాలు, రౌడీలతో ‘పోలీస్ ఫ్రెండ్షిప్’, భూకబ్జాలు, సొంత పార్టీ నేతల మీదే దాడులు తదితర విషయాలపై ఉమ్మడి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఓ ఏసీపీ, ఇద్దరు సీఐల వ్యవహారం దారుణంగా ఉందని..
రౌడీలు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారంటూ ఉదాహరణలతో సహా వివరించడంతో పాటు ఇంత జరుగుతున్నా పోలీస్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో జరుగుతున్న పరిణామాలను సీరియస్‌గా తీసుకొని విచారణకు ఆదేశించిన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అక్కడి ఇంటెలిజెన్స్‌కే ఆ బాధ్యత అప్పగించినట్లు తెలిసింది.
– వరంగల్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్ నగరంలో కొందరు పోలీసులు, రౌడీలు కలిసి పనిచేస్తు న్నారని.. ఇలాంటి వాటిని వెంటనే నియంత్రించాలని వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. రౌడీలకు, మాజీ రౌడీషీటర్లకు కొందరు పోలీసులు పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తున్నారని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చట్టం, న్యాయం అనేవి లేకుండా పోయాయని వివరించారు. పోలీసు అధికారుల ప్రవర్తనపై వరంగల్ పోలీసు కమిషనర్ తీరు అస్సలు బాగా లేదని చెప్పారు. రౌడీలతో కలిసి పనిచేస్తున్న పోలీసులపై కనీస చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. కొందరు పోలీసులు, రౌడీలతో కలిసి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్ నగరంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌ని కలిశారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ రౌడీషీటర్, ఓ ఏసీసీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు కలిసి.. సామాన్యులను ఇబ్బంది పెడుతున్న విషయాలను వివరించారు. వాస్తవాలను నిర్ధారించుకుని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ మాజీ రౌడీషీటర్ పోలీసు మద్దతుతో సామాన్యులతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకుల పైనా దాడులు చేశారని చెప్పారు.
దాడికి గురైన అధికార పార్టీ నేతను పరామర్శించేందుకు వెళ్లాలని ప్రయత్నిస్తే పోలీసులు వద్దని చెప్పారని తెలిపారు. పోలీసులు అంటే రౌడీలకు భయం ఉండేదని, ఇప్పుడు రౌడీలకే పోలీసులు భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. మాజీ రౌడీషీటర్ వస్తుంటే ఓ ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎదురు వెళ్లి సెల్యూట్ చేసి మరీ తీసుకువచ్చి కూర్చోబెడుతున్నారని చెప్పారు. మాజీ రౌడీ షీటరు చెప్పినట్లుగానే పోలీసులు నడుచుకుంటున్నారని, పోలీస్స్టేషన్లలో ఏం చేయాలనేది మాజీ రౌడీషీటర్ శాసిస్తున్నాడని వివరించారు.
రౌడీలను నియంత్రించే విషయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ తీరు అస్సలు బాగా లేదని చెప్పారు. మాజీ రౌడీ షీటర్, పోలీసులు కలిసి అధికార పార్టీ అధ్యక్షుడిపై దాడి చేసినా పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదని అన్నారు. మంత్రి అండదండలు, పోలీసుల మద్దతుతో మాజీ రౌడీ షీటర్ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని పలు ఉదాహరణలతో వివరించారు. వరంగల్ నగరంలోని సామాన్యులకు భూముల కబ్జాలపై భయం పెరుగుతున్నదని, అభివృద్ధి చెందుతున్న నగరానికి ఇలాంటివి మంచివి కాదని తెలిపారు. కుటుంబసభ్యుల మధ్య ఉండే విభేదాలను ఆసరా చేసుకుని పోలీసుల సహకారంతో భూకబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పారు. వరంగల్ నగరంలో ఇప్పడు ఉన్న దారుణ పరిణామాలు తమ 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాపోయారు.
వరంగల్ నగరంలో పోలీసులు, రౌడీలు కలిసి సామాన్యులను ఇబ్బంది పెడుతున్న వ్యవహారంపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫిర్యాదుపై పోలీసు శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించినట్లు తెలిసిం ది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. వరంగల్ పోలీసు కమిషనర్ పరిధిలోని ఇంటెలిజెన్స్ విభాగంపైనా రాష్ట్ర అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజలకు, రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న సంఘటన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయాలని గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఫిర్యాదు అంశాలపై వరంగల్ పోలీసు కమిషనర్ పరిధి ఇంటెలిజెన్స్ విభాగాన్ని పక్కనబెట్టి రాష్ట్ర స్థాయి విభాగం వారే విచారణ మొదలుపెట్టినట్లు తెలిసింది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఓ మాజీ రౌడీ షీటర్‌కు అనధికారికంగా పోలీసు ప్రొటోకాల్‌ను అమలు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఓ ఎమ్మెల్యే వరంగల్ పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్‌కు మాజీ రౌడీ షీటర్ రావడమే కరెక్టు కాదని, అక్కడికి వచ్చిన ఆయనకు ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు సెల్యూట్ చేసి ప్రత్యేకంగా ఓ గదిలోకి తీసుకుపోవడం గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పినట్లు సమాచారం. మాజీ రౌడీ షీటర్‌కు ఇప్పటికే ఇద్దరు గన్‌మెన్ ఉన్నారని, ఇప్పుడు పోలీసుల సహకారంతో వ్యక్తిగత తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేశాడని పేర్కొన్నట్లు తెలిసింది. ప్రజలను ఇబ్బందులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు బాధితులకు కాకుండా ఇబ్బందులు పెట్టే వారికి సహకరించడం సరైన పద్ధతి కాదని వరంగల్ పోలీసు కమిషనర్‌పై ఆ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.