శాయంపేట, మే 8 : కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలమైందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోయినా పెద్ద మనసుతో రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అందిస్తున్నారని తెలిపారు. 2021లో శాయంపేట మండల పరిధిలో వడగండ్ల వానతో దెబ్బతిన్న మిర్చి, మక్కజొన్న పంటల రైతులకు మంజూరైన నష్టపరిహారం చెక్కులను శాయంపేటలోని రైతువేదికలో సోమవారం ఎమ్మెల్యే గండ్ర పంపిణీ చేశారు. అంతకు ముందు శాయంపేట వ్యవసాయ సబ్‌మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ వడగండ్లతో పంటలు దెబ్బతిన్న విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే పరిహారం ఇప్పించే చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆదేశించినట్లు చెప్పారు. ఈ క్రమంలో మండలంలో 322 మంది రైతులకు సుమారు రూ.8లక్షల పరిహారం వచ్చిందన్నారు. గతంలో దెబ్బతిన్న మిర్చికి రూ.5400, మక్కజొన్నకు రూ.3300 మాత్రమే పరిహారం ఇచ్చేవారన్నారు. కానీ, సీఎం కేసీఆర్ పెద్ద మనుసుతో ఎకరానికి రూ.10వేలు ఇవ్వడం గొప్పవిషయమన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు సహకారం అందించాల్సి ఉన్నా, నిర్లక్ష్య ధోరణి అవలంభించిందన్నారు. ప్రకృతి విపత్తు జరిగితే కేంద్రం బృందాలను పంపి సర్వే చేయించి, పరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వమే పునరావాస పథకం కింద పూర్తిగా పరిహారాన్ని రైతులకు అందించిందన్నారు. ఇటీవల అకాల వర్షాలకు కూడా పంటలు దెబ్బతినడంతో శాయంపేట మండలానికి చెందిన మక్కజొన్న రైతులు 1514 మందికి రూ.1.56కోట్ల పరిహారం మంజూరైందన్నారు. వారం రోజుల్లోనే దాన్ని రైతులకు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే గండ్ర ప్రకటించారు. రైతులను పట్టించుకోని పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
ఎలాంటి పైరవీలు లేకుండా రైతుబంధు కింద రైతులకు ఏడాదికి పది వేలు అందుతున్నదన్నారు. గతంలో ఎస్సారెస్పీ కాల్వ మాత్రమే ఉండేదని కానీ నేడు కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. చలివాగు ప్రాజెక్టులో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్ర రైతుల అవసరాలు తీరిన తర్వాతే నీళ్లు తీసుకెళ్లాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు. మండలంలో ఇంకా అవసరమైతే ప్రగతిసింగారం, కొప్పుల, గట్లకానిపర్తి గ్రామాల్లోనూ మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. వెంటనే రైతు వేదికల్లో సమావేశాలు పెట్టి, వానకాలంలో వేసే పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పరిహారం విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, తమ ప్రమేయం లేకుండానే పూర్తి చేశారన్నారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే పరిశీలించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్‌రావు, ఏడీఏ రవీందర్, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శరత్, ఏఎంసీ వైస్ చైర్మన్ నందం, ఎంపీటీసీలు బాసాని చంద్రప్రకాశ్, మేకల శ్రీనివాస్, సర్పంచ్‌లు రవి, రాజిరెడ్డి, సాంబయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఏఈవోలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.