జనగామ, (నమస్తే తెలంగాణ)/నర్మెట, డిసెంబర్ 29 : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చూడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం జనగామ పట్టణం 4, 8, 9,13 వార్డుల్లో, నర్మెట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన పట్టణ, గ్రామసభలను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీలకు ప్రజలు అందిస్తున్న దరఖాస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. జనవరి 6వ తేదీ వరకు గ్రామపంచాయతీల్లో దరఖాస్తులు అందించవచ్చని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గద్దల నర్సింగరావు, నర్మెట ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, సర్పంచ్ ఆమెడపు కమలాకర్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్, నర్మెట, తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, వెల్దండ సర్పంచ్ నర్ర వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు.