వరంగల్, మే 7 : గ్రేటర్లో 30 నెలల పా టు కాంగ్రెస్ పాలనలో చేసిన ప్రతీ తప్పును ప్రశ్నిస్తామని వరంగల్ తూర్పు నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో గ్రేటర్లో అవినీతి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులను వదిలిపెట్టేది లేదన్నారు.
బల్దియాలో జరిగిన అవినీతతిపై పూర్తి సమాచారం ఉందని, ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. నిన్నటితో ముగిసిన పాలక మండలి హయాంలో కమీషన్ల దందా పరాకాష్టకు చేరిందని విమర్శించారు. ప్రతి పనికి కాంట్రాక్టర్ల నుంచి 6 నుంచి 9 శాతం వరకు కమీషన్లు వసూళ్లు చేశారన్నారు. అంతర్గత బదిలీల్లో సైతం ఉద్యోగుల నుంచి కమీషన్లు తీసుకున్న దౌర్భాగ్యపు పాలన సాగిందని ధ్వజమెత్తారు. నగరాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి మాస్టర్ ప్లాన్ పేరుతో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.
నచ్చిన వారి భూములను గ్రీన్ జోన్, నచ్చని వారి భూములను రోడ్డు అలైన్‌మెంట్‌గా మార్చారని ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా పనిచేసిన తాను రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నానని తెలిపారు. కార్పొరేషన్ ప్రతిష్టను పెంచి గౌరవంగా బయటకు వచ్చానన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, 30 నెలల పాలనలో కాంగ్రెస్, బీజేపీ చేసిన విధ్వంసంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. రోడ్డు కబ్జాలు, ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ల వంటి అంశాలపై నిరంతర పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎనుమాముల మార్కె ట్ మాజీ చైర్మన్ టీ రమేశ్‌బాబు, మాజీ కార్పొరేటర్లు కుందారపు రాజేందర్, రామా బాబురావు, దండు దయాసాగర్, బీఆర్ఎస్ నాయకులు గోరంట్ల మనోహర్, మోడెం ప్రవీణ్, నీలం రాజ్ కిశోర్, కొంతం మోహన్ పాల్గొన్నారు.