న్యూఢిల్లీ, జూలై 28 : బంగారం, వెండి ధరలు ఒక్కరోజులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం భారీగా పెరిగిన ధరలు ఆ మరుసటి రోజూ అంతేస్థాయిలో కిందికి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కె ట్లో డిమాండ్ పడిపోవడం, రూపాయి పుంజుకోవడం ధరలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా న్యూ ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,640 తగ్గి రూ.1.47 లక్షలకు దిగొచ్చింది. అంతకుముందు రూ.1, 49,640గా ఉన్నదని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా దిగొచ్చాయి.
కిలో వెండి ఏకంగా రూ.5,200 తగ్గి రూ.2,24, 800గా నమోదైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పెరగడంతో మదుపర్లు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల నుంచి ఈక్విటీల వైపు మళ్లించడంతో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఔన్స్ గోల్డ్ ధర 53.40 డాలర్లు లేదా 1.31 శాతం తగ్గి 4,023.50 డాలర్లకు పరిమితమవగా, వెండి 2 శాతం దిగి 57.24 డాలర్లుగా ఉన్నది.