గిర్మాజీపేట, మే 1: కార్మికులకు అండగా, తోడుగా ఉంటానని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మేడే సందర్భంగా సోమవారం ఆయన స్టేషన్‌రోడ్డు ఎస్2 సెంటర్లోని ఆటో కార్మికుల అడ్డా వద్ద కార్పొరేటర్ గందె కల్పన ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలోని కార్మికులను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. తోళ్ల పరిశ్రమ అంతరించిపోతుంటే చోద్యం చూశారని, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆజాంజాహి మిల్స్‌ను కాంగ్రెస్ పాలకులు అమ్ముకొని కార్మికుల పొట్టకొట్టారని ధ్వజమెత్తారు. తాను ఓ కార్మికుడి బిడ్డగా, కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. బీఆర్ఎస్ నేత గందె నవీన్ మాట్లాడుతూ రూ. 3800 కోట్లతో తూర్పు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే నరేందర్ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే కృషితో రూ. 1100 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ దవాఖాన, రూ. 75 కోట్లతో అధునాతన బస్‌స్టేషన్ వరంగల్‌కు మంజూరైందన్నారు. స్టేషన్‌రోడ్డు, జేపీఎన్రోడ్, ఎంజీఎం సెంటర్ అద్భుతంగా తయారైనట్లు వివరించారు. అనంతరం నన్నపునేని 33వ డివిజన్లోని ఇసుక అడ్డా జంక్షన్ వద్ద జెండాను ఆవిష్కరించారు. తర్వాత తూర్పుకోట హనుమాన్ భక్తులకు సంబంధించిన వాల్ పోస్టర్లను శివనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో నరేందర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ, బీఆర్ఎస్ నేత ముష్కమల్ల సుధాకర్, డివిజన్ అధ్యక్షుడు మీరిపెల్లి వినయ్‌కుమార్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
వరంగల్‌చౌరస్తా: రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఎంజీఎం సర్కిల్లో మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గడల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నన్నపునేని పాల్గొని బీఆర్టీయూ కార్మిక జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఎంసీపీఐ(యూ) ఓంకార్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకలు నర్ర పత్రాప్, మాలి ప్రభాకర్, ఐతం నగేశ్, రాయినేని ఐలయ్య, నరసయ్య, రాజేందర్, గోవర్ధన్, రవి, అనూష, ప్రేమలత పాల్గొన్నారు. ఎంజీఎం సర్కిల్లో ఓరుగల్లు అంబులెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ యెలగం సత్యనారాయణ పతాకాన్ని ఆవిష్కరించి, కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు హరికృష్ణ, వినయ్ పాల్గొన్నారు.
కరీమాబాద్/కాశీబుగ్గ: బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొని జెండాలను ఎగురవేశారు. కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్మికుల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. 32వ డివిజన్లో కార్పొరేటర్ పల్లం పద్మ మేడే వేడుకల్లో పాల్గొన్నారు. అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని పలు కార్మిక సంఘం భవనాల్లో కార్మికులు జెండా ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే, లక్ష్మీపురం కూరగాయలు, పండ్ల మార్కెట్ పరిధిలోని హమాలీల ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఎమ్మెల్యే నరేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. వరంగల్ పట్టణ కూరగాయల మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్(బీఆర్టీయూ అనుబంధం) ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరిచారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు చింతాకుల సునీల్, బోగి సువర్ణ, సోమిశెట్టి ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్, డివిజన్ అధ్యక్షుడు పోలెపాక యాకూబ్ పాల్గొన్నారు.