నర్సంపేట, మార్చి 18: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సాగవుతున్న పంటలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో టీం సభ్యులు మూడు రోజుల స్టడీటూర్ చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం రెండో రోజు అహ్మదాబాద్ జిల్లా సమీపంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ ప్రాంతంలో సాగవుతున్న జామ, ద్రాక్షతోటలను పరిశీలించారు. పంటలకు నీరందించే విధానం, పంట దిగుబడిని రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయంలో నూతన విధానాలు, సాంకేతిక పద్ధతులపై రైతు ఉత్పత్తి సంఘాల(ఎఫ్‌పీవో)తో మంత్రి, ఎమ్మెల్యే బృందం మాట్లాడింది. మార్కెటింగ్ సౌకర్యాలపై ఆరా తీశారు. పంట సాగు నుంచి విక్రయాల వరకూ చేపట్టాల్సిన పద్ధతలను అడిగి తెలుసుకున్నారు. పంటల తీరు, పెట్టుబడి, దిగుబడి, సాగు విధానం, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులతో చర్చించారు. మహారాష్ట్ర రైతులు చేపడుతున్న పంటల సాగుపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. సాగుకు అవసరమైన ఆధునిక వ్యవసాయ పద్ధతులను గురించి తెలుసుకున్నామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో రైతులు చేపడుతున్న సాగు విధానాలు, మహారాష్ట్రలో అనుకూల పద్ధతులను రైతులకు వివరిస్తామని తెలిపారు.