శాయంపేట, నవంబర్ 18 : మండల పరిధిలోని గ్రామపంచాయతీల్లో నకిలీ అధికారి గురువారం హల్చల్ చేశాడు. తాను విజిలెన్స్ అధికారినని హడలెత్తించాడు. పంచాయతీల్లో పల్లెప్రగతి రిజిస్టర్లను తనిఖీ చేసి హడావుడి చేశాడు. చివరకు డబ్బులు అడగడంతో ఆలస్యంగా నకిలీ అధికారిగా అధికారులు గుర్తించారు. మండలంలోని పెద్దకోడెపాక, మైలారం, జోగంపల్లి, గంగిరేణిగూడెం గ్రామ పంచాయతీల్లో నకిలీ అధికారి వ్యవహారం కలకలం రేపింది. ఈ గ్రామ పంచాయతీలకు వెళ్లిన నకిలీ అధికారి పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లను హడలెత్తించినట్లు చెబుతున్నారు. విజిలెన్స్ శాఖ నుంచి వచ్చినట్లు చెప్పి పల్లెప్రగతిలో చేపట్టిన పనుల రిజిస్టర్లను చూపాలని అడుగడంతో కార్యదర్శలు రిజిస్టర్లను అందజేశారు. వాటిలో ఒక్కొక్కటి నకిలీ అధికారి పరిశీలించాడు. జోగంపల్లితో మరికొన్ని గ్రామాల్లోనూ సర్పంచ్లు స్థానికంగా ఉండడం లేదట, ఇలా అయితే ప్రభుత్వానికి రిపోర్టు చేస్తానని బెదిరించాడు. సర్పంచ్లతో మాత్రం కఠినంగా మాట్లాడినట్లు ప్రజలు చెప్పారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు ఏమిటి, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ ఫైర్ అయినట్లు పేర్కొన్నారు. అంత హడావుడి చేశాక చివరకు తనకు ఖర్చులు ఉంటాయని డబ్బులు ఇవ్వాలని అడిగినట్లు చెప్పారు. అయితే, మండల అధికారులకు విషయం తెలియడంతో ప్రభుత్వం నుంచి ఏ అధికారి గ్రామ పంచాయతీలకు రాలేదని డబ్బులు ఎందుకు అడుగుతారని అనుమానం వ్యక్తం చేశారు. తీరా ఆరా తీయడంతో విజిలెన్స్ అధికారిగా చెప్పిన వ్యక్తి పేరును సుమన్ అని చెప్పినట్లు ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. ఇలాంటి నకిలీ అధికారులపై ఏ మాత్రం అనుమానం వచ్చినా డయల్ 100కు కాల్ చేయాలని కార్యదర్శులు, సర్పంచ్లకు సమాచారం చేరవేసినట్లు పేర్కొన్నారు. పెద్దకోడెపాక జీపీలోని సీసీ కెమెరాలో నకిలీ అధికారి బాగోతం రికార్డు అయిందని, ఫుటేజీని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యదర్శులు, సర్పంచ్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామపంచాయతీల్లోనే ఏకగాంగా ప్రభుత్వ పనుల రిజిస్టర్లను తనిఖీ చేయడం సంచలనంగా మారింది. అయినా నకిలీ అధికారా? ప్రభుత్వ అధికారా? అని గుర్తించకుండానే రిజిస్టర్లను అందజేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.