ఖిలావరంగల్, ఫిబ్రవరి 14 : జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకుల ద్వారా లక్ష్యానికి మించి రుణాలు అందించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిలా స్థాయి బ్యాంకర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంకుల ద్వారా రూ.2,744 కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా, లక్ష్యానికి మించి రూ.4036కోట్లు అందజేశారన్నారు. ఇందులో రూ.1,233 కోట్లు వ్యవసాయ రంగానికి అందించాల్సి ఉండగా రూ.1,350 కోట్ల 40 లక్షలు అందజేశారన్నారు. పారిశ్రామిక రంగానికి రూ.702 కోట్ల 80లక్షలకు గాను రూ.754కోట్ల 80లక్షలు అందించామన్నారు. అలాగే, మహిళా స్వయం సహాయక సం ఘాల రుణాల మంజూరులో రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. వీరికి రూ.325 కోట్ల 13లక్షలకు గాను రూ.337 కోట్ల 37 లక్షలు అందజేశామన్నారు. జిల్లాలో ఇంత భారీగా రుణాలు అందించడానికి నిరంతరం కృషి చేసిన కలెక్టర్‌తోపాటు అధికారులను అభినందించారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన 12,668 మంది మిరప రైతులు, 4342 మక్కజొన్న పంట రైతుల రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణాలను రీ షెడ్యూల్ చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు కార్యక్రమం కింద ఎంపికైన లబ్ధిదారులకు సకాలంలో బ్యాంక్ అకౌంట్లు తెరిచి గ్రౌండింగ్ చేయాలన్నారు.
డిజిటల్ లావాదేవీలపై అవగాహన..
ఈ నెల 18 వరకు ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా అన్ని గ్రామీణ బ్యాంకు శాఖల్లో గో డిజిటల్, గో సెక్యూర్ అనే నినాదంతో డిజిటల్ లావాదేవీలు-వాటి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీఎంఈజీపీ ముద్ర, స్టాండ్ ఆఫ్ ఇండియా రుణాలను అర్హులందరికీ అందజేయాలని మంత్రి ఎర్రబెల్లి బ్యాంక్ అధికారులకు సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 405 మందికి రూ.35 కోట్ల లక్ష్యానికి గాను 233 మంది లబ్ధిదారులకు రూ.19కోట్లు మాత్రమే గ్రౌండింగ్ చేశారన్నారు. గిరిజన సంక్షేమం కింద 640 యూనిట్లు, 40 కోట్లకు గాను 609 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేశారని, పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ట్రైబల్ వెల్ఫేర్‌కు ఈ ఏ డాది 1,118 యూనిట్లకు రూ.31 కోట్లు రుణాలు మం జూరు చేయాలన్నారు. మినీ డెయిరీ పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రెండు గేదెలు చొప్పున రాయపర్తి, నల్లబెల్లి, నెక్కొండ మండలాలకు చెందిన వారికి బ్యాంకర్లు మంజూరు చేయాలన్నారు. ఇప్పటికే రెండు గేదెలు ఇచ్చిన వారికి మిగతా రెండు గేదెలను ఇవ్వాలన్నారు. ఈ ఏడాది కూడా జిల్లాకు అవార్డు వచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు.
అవసరానికి అనుగుణంగా ఇవ్వాలి:నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
జిల్లాలోని బ్యాంకర్లు వ్యవసాయ, పరిశ్రమ రంగాల కు అవసరానికి అనుగుణంగా రుణాలివ్వాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. జిల్లాలోని బ్యాంకర్లు ప్రాధాన్యతా రంగాలకు నిర్ణీత గడువులోగా రుణాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బీ గోపి, అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి సత్యజిత్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం శంకర్‌లాల్, డీఆర్డీవో సంపత్‌రావు, ఆర్బీఐ ఏజీఎం రహ్మాన్, నాబార్డు డీడీఎం ఎల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.