విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలి : కలెక్టర్ బీ గోపి
ఖిలావరంగల్, నవంబర్ 18 : రైతు వేదికల్లో మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు వేదికలను త్వరిగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఉషాదయాళ్, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ శంకరయ్య పాల్గొన్నారు.
ఉపకార వేతనాలు అందించాలి..
పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విద్యార్థులకు అందేలా చూడాలని కలెక్టర్ గోపి అన్నా రు. కలెక్టరేట్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల వివరాలను ఈ నెల 25లోపు జిల్లా సంక్షేమ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. 2017-18, 2021-22 సంవత్సరాలకు గాను పాతవి రెన్యూవల్తోపాటు కొత్త దరఖాస్తులను అధికారులకు అందజేయాలన్నారు. వచ్చే నెల 6 వరకు విద్యార్థుల ఖాతాలో ఉపకార వేతనాలు వేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నిర్మల, అధికారులు పాల్గొన్నారు.