వరంగల్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కార్పొరేట్’ ప్రభావంతో మూతపడిన సర్కారు బడి.. ఇప్పుడు నాణ్యమైన విద్యతో మళ్లీ గొప్పగా మారింది. అడ్మిషన్లు ఫుల్ అని బోర్డు పెట్టే స్థాయికి ఎదిగింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలోని ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నిలిచింది. 2010లో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల (ఎంపీయూపీఎస్)గా ఉన్న ఈ బడి విద్యార్థులు లేక అప్పుడు మూత పడింది. ఊరిలోని పిల్లలంతా ప్రైవేట్ బాట పట్టారు. ఆ తర్వాత గ్రామస్తుల్లో ఆలోచన మొదలైంది. తెలంగాణ ఏర్పాటుతో మార్పు షురువైంది. 2015లో ఊరిలో అంతా అనుకుని విద్యాభివృద్ధి కమిటీ వేసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పాఠశాలను తిరిగి ప్రారంభించుకున్నారు. అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్వయంగా వచ్చి ఒంటిమామిడిపల్లి పాఠశాలలు ప్రారంభించారు. ఏడో తరగతి వరకు ఉన్న పాఠశాలను 10వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేశారు. అదనపు తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పూర్తి ఇంగ్లిష్ మీడియం పాఠశాలగా అవతరించింది. అప్పటి నుంచి విద్యార్థుల సంఖ్య గరిష్ఠ సంఖ్యలో ఉంటూ వస్తున్నది. కరోనా సమయంలోనూ ఈ స్కూలులో అడ్మిషన్ల సంఖ్య ఎంతమాత్రం తగ్గలేదు. లాక్‌డౌన్‌కు ముందు ఈ పాఠశాలలో 435 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 464 మందికి చేరారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదవుతోపాటు అన్ని అంశాల్లో ప్రతిభ చూపుతున్నారు.
సకల వసతులు.. ఆహ్లాదకర వాతావరణం
ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో సకల వసతులున్నాయి. ప్రభుత్వ నిధులతో ఈ స్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. పునఃప్రారంభం తర్వాత పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో అదనంగా నాలుగు తరగతి గదులు నిర్మించారు. అన్ని తరగతి గదుల్లో విద్యార్థులకు అనుకూలంగా డెస్క్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను, ప్రతిభను గుర్తించి గొప్పగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఇతర సౌకర్యాలను సమకూర్చారు. ఒక గదిలో అన్ని రకాల పరికరాలతో ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. హరితహారం స్ఫూర్తితో ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన జరగాలనే లక్ష్యంతో విద్యాకమిటీ సభ్యులు మొక్కలు నాటి పాఠశాలను పచ్చదనంతో నిండిపోయేలా చేశారు. రంగులు వేయించి సరికొత్తగా తీర్చిదిద్దారు. దాతల సహకారంతో విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా సర్వస్వతీ మాత, అబ్దుల్‌కలామ్, సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలు ఏర్పాటు చేశారు.
ప్రత్యేకంగా అభివృద్ధి నిధి..
ఒంటిమామిడిపల్లి పాఠశాల పునర్వైభవం కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇక్కడ గతంలో ప్రైవేట్ స్కూళ్లకు చెల్లించే ఫీజు ఏటా రూ.50 లక్షల దాకా ఉంటున్నట్లు గుర్తించి ఉన్న ఊళ్లో సర్కారు బడిని పెట్టుకుని ఇంత మొత్తాన్ని ప్రైవేట్ స్కూళ్లకు అప్పగించడం ఎందుకు? అనే ఆలోచనకు వచ్చారు. సొంత బడిని బాగు చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు కదిలారు. ప్రభుత్వ సహకారంతోపాటు స్థానికంగా బాధ్యతగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేశారు. దీంతో ఎప్పటికప్పడు అవసరమైన మేరకు అదనపు సిబ్బందిని, వసతులు సమకూర్చుకుంటున్నారు. బడి అభివృద్ధి నిధికి ఏటా రూ.18 లక్షల దాకా జమ అవుతున్నాయి. వీటితో ప్రభుత్వ ఉపాధ్యాయులకు అదనంగా మరో ఎనిమిదిమంది టీచర్లను, ముగ్గురు ఆయాలను నియమించారు. అన్ని వ్యవహారాలను పాఠశాల నిర్వహణ కమిటీయే చూసుకుంటున్నది.
డిజిటల్ తరగతులు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు కంప్యూటర్ విద్యపై అవగాహన పెంచేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. పాఠశాలలో సీసీ కెమెరాలు, డీజీ క్లాస్ రూం ఉన్నాయి. ఎస్ఎంసీ ఫండ్ నుంచి 10 అధునాతన కంఫ్యూటర్లు కొనుగోలు చేసి ప్రత్యేకంగా తరగతి గదిని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఇక్కడ పూర్తి స్థాయిలో కంప్యూటర్ బోధన అందుతున్నది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల దాకా తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల సమయం పూర్తయిన తర్వాత విద్యార్థులకు అవసరమైన మేరకు స్థానిక విద్యావంతులు ప్రత్యేకంగా తరగతులు తీసుకుంటున్నారు. హోం వర్క్ పనులు పూర్తి చేయడంలో సహకరిస్తున్నారు.
ప్రభుత్వం, తల్లిదండ్రుల తోడ్పాటు మరువలేనిది
మా ఊరి పాఠశాల పునఃప్రారంభం నుంచి విద్యార్థులకు తగిన వసతుల కోసం ఎప్పటికప్పుడు ప్రణాళిక రూపొందించి పని చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, తల్లిదండ్రులు, అధికారులు, ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది. ఎమ్మెల్యే అరూరి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు సహకారంతో మా పాఠశాలకు మంచి రోజులు వచ్చాయి.
– పొన్నల రాజు, ఎస్ఎంసీ చైర్మన్
అందరి సహకారంతోనే..
ఒంటిమామిడిపల్లి పాఠశాలను అభివృద్ధి పథకంలో నడపడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, ఉపాధ్యాయుల సహకారం ఎనలేనిది. విద్యార్థుల్లో సృజన్మాకతను వెలికి తీసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేశాం. ఇక్కడ నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ఉంది.
– రమాదేవి, ప్రధానోపాధ్యాయురాలు