వరంగల్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు మరింత దూకుడుగా వెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బూత్ స్థాయి మొదలు నియోజకవర్గ శ్రేణుల దాకా అందరూ సమన్వయం, ప్రత్యేక కార్యాచరణతో ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని ఇటీవల టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కార్యాచరణ అమలులో భాగంగా అనుసరించాల్సిన విధానాలపై శుక్రవారం పర్వతగిరిలో మంత్రి నేతృత్వంలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా గ్రామ, బూత్ స్థాయిలోని వారితో సమన్వయం చేసుకోవాలని ఎర్రబెల్లి సూచించారు. వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించే ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో పర్యటనలు ఉండాలని అభిప్రాయపడ్డారు.