కాజీపేట, అక్టోబర్ 8: సినిమా థియేటర్లో మనకు నచ్చిన సీటును రిజర్వు చేసుకొని అక్కడే కూర్చోవచ్చు. కానీ, రైలు ప్రయాణంలో మాత్రం అలాంటి సదుపాయం లేదు. రైల్వే శాఖ కేటాయించిన సీట్లలోనే ప్రయాణికులు కూర్చోవాలి. ఇందుకు కారణం ఏమిటో చాలా మందికి తెలియదు. రైళ్లలో తాము కోరుకున్న సీట్లు, బెర్త్‌లు ఇవ్వడం లేదని టికెట్ రిజర్వేషన్ చేసుకునే సందర్భాల్లో రైల్వే సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటనలు, విమర్శలు కోకొల్లలు. రైళ్లలో రద్దీ అధికంగా ఉండడంతో తమకు అనుకూలంగా సీట్లు, టికెట్లు, బెర్తులు దొరకడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. శాస్త్రీయ పద్ధతి ప్రకారమే రైళ్లలో ప్రయాణికులకు టికెట్లను కేటాయిస్తారని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల వయస్సు, బరువును అంచనా వేస్తూ టికెట్లు కేటాయిస్తారు. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేకమైన శాస్త్రీయమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నది. ఈ విధానాన్ని పరిశీలిస్తే.. రైలు మధ్య బోగీల సీట్ల నుంచి ప్రయాణికుల టికెట్ల కేటాయింపు ప్రారంభం అవుతుంది. ప్రయాణికుల బరువును అన్ని కోచ్‌ల్లో అన్ని వైపులా సమానంగా ఉండే విధంగా ఐఆర్సీటీసీ సాఫ్ట్వేర్ టికెట్లను జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రయాణికులు దరఖాస్తులో తెలియజేసే వయస్సు, సంఖ్యను సాఫ్ట్వేర్ పరిగణనలోకి తీసుకుంటుంది.
ఒక రైలుకు 10 స్లీపర్ క్లాస్ కోచ్‌లు (ఎన్ 1 నుంచి ఎస్ 10) వరకు ఉంటే.. ఒక్కో కోచ్‌లో మొత్తం 72 సీట్లతో 10 కోచ్‌ల్లో 720 సీట్లు ఉంటాయి. మొదట టికెట్ రిజర్వేషన్ చేసుకునే వ్యక్తికి మధ్య భాగంలో అంటే ఎస్-5లో కంఫ్యూటర్లో సాఫ్ట్‌వేర్‌ను కేటాయిస్తుంది. బోగీలోని మధ్య సీట్ల నుంచి టికెట్ బుకింగ్ అవుతుంది. అంటే బోగీలోని 72 సీట్లుంటే 36వ సీటును కేటాయిస్తుంది. ఇక చివరిగా బుక్ చేసుకొనే వ్యక్తికి ఎస్-1 లేదా ఎస్ 10 బోగీలో సీటు కేటాయిస్తారు. బెర్త్‌ల విషయంలోనూ మొదట పైబెర్త్, ఆ తర్వాత మధ్య బెర్త్, చివరకు కింది బెర్త్‌ను అలాట్ చేస్తారు. క్రమపద్ధతి లేకుండా టికెట్ రిజర్వేషన్లు చేస్తే కొన్ని బోగీలు పూర్తిగా నిండిపోయి, మరికొన్ని ఖాళీగా ఉండే అవకాశముంది. ఇలాంటి సమయాల్లో మలుపుల వద్ద రైలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని బోగీలపై ఎక్కువ అపకేంద్ర బలముంటే, మరికొన్నింటిపై తక్కువగా ఉంటుంది. ఈ ఫలితంగా రైలు పట్టాలు తప్పుతుంది. ఈ కారణంగానే రైలు ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు, భద్రతా చర్యల్లో భాగంగానే సీట్లు, బెర్త్‌లను రైల్వే శాఖ క్రమపద్ధతిలో కేటాయిస్తుంది.