నర్సంపేట/గీసుగొండ, సెప్టెంబర్ 15: నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ గోపి పిలుపునిచ్చారు. నర్సంపేటలోని జడ్పీహెచ్ఎస్లో గురువారం ఆయన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చెప్పులు లేకుండా నడువడం, మట్టిలో ఆడడం, చాక్ఫీస్లు, బలపాలు, మట్టిని తినడం వల్ల శరీరంలో నులిపురుగులు తయారవుతాయని వివరించారు. ఈ పురుగులు పేగుల్లో ఉండి రక్తాన్ని పీల్చుకుంటాయని తెలిపారు. దీనివల్ల పిల్లలు భుజించిన ఆహారం ఒంటికి పట్టకపోవడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. అల్బెండజోల్ మాత్రలు వేయడం వల్ల నులిపురుగులు పిల్లల శరీరం నుంచి బయటకు పోతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, అదనపు కలెక్టర్ హరిసింగ్, ఆర్డీవో పవన్‌కుమార్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రకాశ్, తాసిల్దార్ రామ్మూర్తి, వైద్యాధికారి భూపేశ్ పాల్గొన్నారు. గీసుగొండ మండలం ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో జిల్లా వైద్యాధికారి కాజీపేట వెంకటరమణ పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. గీసుగొండ ప్రభుత్వ పాఠశాలలో వైద్యాధికారి మాధవీలత పిల్లలకు మాత్రలు వేశారు. ఎలుకుర్తిలో అంగన్వాడీ కేంద్రంలో ఎంపీపీ సౌజన్య మాత్రలు పంపిణీ చేశారు. మిగిలిన పిల్లలకు ఈ నెల 22న నులిపురుగు నివారణ మాత్రలు వేస్తామన్నారు.
ఊరూరా డీవార్మింగ్ డే..
నల్లబెల్లి/ఖానాపురం/వర్ధన్నపేట/చెన్నారావుపేట/కరీమాబాద్/నర్సంపేటరూరల్/పోచమ్మమైదాన్/రాయపర్తి/సంగెం: నల్లబెల్లి, మేడెపల్లి పీహెచ్‌సీల ఆధ్వర్యంలో మండలవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. కార్యదర్శి నాలగిరి రజిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఖానాపురం మండలం ప్రభుత్వ పాఠశాలలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, కొత్తూరు జీపీలో సర్పంచ్ రమా అశోక్, బుధరావుపేట మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ రాజేందర్, ఐనపల్లి జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో మండల వైద్యాధికారి మల్యాల అరుణ్‌కుమార్ విద్యార్థులకు నులిపురుగల నివారణ మాత్రలు వేశారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద కేజీబీవీతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేశారు.
పర్వతగిరిలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీటీసీ మాడ్గుల రాజు, బొట్ల మహేంద్ర, ఉపసర్పంచ్ జనార్దన్, వైస్ ప్రిన్సిపాల్ స్వాతి, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలంలో అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. తిమ్మరాయిన్పహాడ్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గోళీలు అందించారు. విద్యానగర్‌లోని చాణక్య పాఠశాలలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. సామాజికవేత్త అచ్చ వినోద్‌కుమార్ పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో చిన్నారులకు నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ చేశారు. ఇటుకాలపల్లి, లక్నేపల్లిలో సర్పంచ్‌లు మండల రవీందర్, గొడిశాల రాంబాబుగౌడ్, ముగ్దుంపురంలో సర్పంచ్ జ్యోతిప్రభాకర్, రామవరం, గురిజాలలో సర్పంచ్‌లు కొడారి రవన్న, గొడిశాల మమత పిల్లలకు మాత్రలు అందించారు. వరంగల్ ఎల్బీ నగర్‌లోని ప్రభుత్వ చార్‌బౌళి ఉన్నత పాఠశాలలో పిల్లలకు డాక్టర్ భవ్యశ్రీ అల్బెండజోల్ మాత్రలు వేశారు. రాయపర్తిలోని జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్‌లో మండల వైద్యాధికారి భూక్యా వెంకటేశ్ పిల్లలకు మాత్రలు అందించారు. సంగెం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.