పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 11 : వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఐదేళ్లుగా హైదరాబాద్‌లో కలిసి ఉంటూ ఎస్సై ఉద్యోగం సాధించేందుకు ప్రిపేరవుతున్నారు. ఈ క్రమంలో శనివారం మిత్రుడి తమ్ముడి దశ దిన కర్మకు హాజరై బైక్‌పై వెళ్తుండగా, నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి దుర్మరణం చెందారు. మరణంలోనూ స్నేహబంధాన్ని వీడలేదు. ఎదిగిన కొడుకులు కుటుంబానికి పెద్ద దిక్కువగా ఉంటారనుకుంటే కానరాని లోకాలకు వెళ్లి తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చారని కుటుంబసభ్యులు వాపోయారు. పోలీసులు, కు టుంబ సభ్యుల కథనం ప్రకారం.. నల్లబెల్లి మండ లం అరవయ్యపల్లెకు చెందిన గుండారపు చంద్రమౌళి-సునీతల కుమారుడు ప్రశాంత్ (24) ఎం బీఏ పూర్తి చేశాడు. ఇటీవల ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష కూడా రాశాడు. వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటలో మిత్రుడి సోదరుడు వనం రాకేశ్ దశదిన కర్మకోసం శనివారం సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రాణస్నేహితుడు గౌతమ బుద్ధుడుతో నగరానికి వచ్చాడు. రాత్రి హైదరాబాద్ వెళ్లడానికి కాజీపేట రైల్వే స్టేషన్‌కు రాగా, ట్రైను వెళ్లిపోయింది. దీంతో మరో మిత్రుడి బైక్ తీసుకుని ఊరుగొండలో ఉన్న పెద్దమ్మ ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో దేశాయిపేట, పైడిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టులో ప్రమాదవశాత్తు పడిపోయారు. రాత్రి కావడంతో ఎవరూ చూడకపోవడంతో ప్రశాంత్‌తో పాటు గౌతమ్ మృతిచెందారు. ఆదివారం ఉదయం కల్వర్టు దగ్గరికి పని చేసేందుకు వచ్చినవాళ్లు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఇంతెజార్గంజ్ సీఐ మల్లేశ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఎస్సై కల నెరవేరకుండానే..
నల్లబెల్లి మండలం అరవయ్యపల్లె గ్రామానికి చెందిన ప్రశాంత్ (24), సిద్దిపేట జిల్లా సూరంపల్లికు చెందిన ముత్యాల గౌతమ బుద్ధుడు (23) ఇటీవల ఎస్సై పరీక్ష రాశారు. ఎలాగైనా ఉద్యోగం సాధించి కన్నవారి కలలు నెరవేర్చాలనే పట్టుదలతో ఉన్న వీరిని దురదృష్ణం వెంటాడింది. వీరద్దరూ ఐదేళ్ల నుంచి హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే క్రమంలో శనివారం వరంగల్‌కు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని చెబుతూ కుటుంబసభ్యులు విలపించారు. కాగా, ప్రశాంత్ తండ్రి చంద్రమౌళి రైస్‌మిల్లులో హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నది.
కాంట్రాక్టర్‌పై కేసు నమోదు..
గిర్మాజీపేట : ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేకుండా కల్వర్టు నిర్మాణ పనులు చేస్తూ ఇద్దరు యువకుల చావుకు కారణమైన కాంట్రాక్టర్ రవీందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. ప్రశాంత్, ముత్యాల గౌతమబుద్ధుడు శనివారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా దేశాయిపేట-పైడిపల్లి దారిలో మద్దెలకుంట వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి మృతిచెందారు. ప్రశాంత్ తండ్రి చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.