వరంగల్‌చౌరస్తా, సెప్టెంబర్ 11: పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం చేకూరుతుందని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ అన్నారు. వరంగల్ 36వ డివిజన్ పుప్పాలగుట్ట ప్రాంతంలో ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించి, ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల నీటి కాలుష్యం జరిగి మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. వీటి నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇంటి ఆవరణ, పరిసరాల్లో మురుగు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని, తుప్పు పట్టిన ఇనుము, వినియోగించిన వాహన టైర్లు, పని చేయని ఇతరత్రా వస్తువుల్లో నీరు నిల్వకుండా చూడాలన్నారు. అలాగే, తొట్లు, డ్రమ్ములను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేసుకోవాలని కోరారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు కరెంటు స్తంభాలను తాకొద్దన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం..
ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన కోరారు. 32, 39, 40, 41, 42వ డివిజన్లో ఆయా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఆదివారం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల శుభ్రత పాటించాలని కోరారు. దోమలు వృద్ది చెందకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్, టీఆర్ఎస్ నాయకులు, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ కోరారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్ఐ సజాంరాజు, మలేరియా సిబ్బంది, డివిజన్ టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే, 25వ డివిజన్లో జీడబ్ల్యూఎంసీ సిబ్బంది సీజనల్ వ్యాధులపై ఇంటింటా ప్రచారం నిర్వహించారు.