వర్ధన్నపేట, నవంబర్ 28: ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దశాబ్దాలుగా పంట కాల్వలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువుల కింద స్థిరీకరించిన ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా అధికారులు కాల్వల మరమ్మతులకు సిద్ధమవుతున్నారు. పంట కాల్వలు కూడా క్రమంగా ఆక్రమణకు గురై కుచించుకుపోయాయి. దీంతో చెరువులో సమృద్ధిగా నీరు ఉన్నా చివరి ఆయకట్టు రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అధికారులు కాల్వలను గుర్తించి హద్దులు నిర్ణయిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని రైతుబంధు సమితి ప్రతినిధులతో కలిసి నక్ష ఆధారంగా కాల్వలను విస్తరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలోని ఇల్లంద పెద్దచెరువు కింద ఐబీ అధికారులు కాల్వలను గుర్తించి కొలతలు తీసుకున్నారు. ఇదేతరహాలో జిల్లాలోని అన్ని చెరువుల కింద ఉన్న కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టేందుకు కొలతలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అన్నదాతల హర్షం
పంట కాల్వల మరమ్మతు పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధం అవుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెరువుల్లో నీరు సరిగా లేకపోవడంతో చివరి ఆయకట్టు రైతులు తీవ్ర నిరాశకు గురయ్యేవారు. కేవలం చెరువుకు సమీపంగా ఉన్న పంట పొలాలకు మాత్రమే నీరందడంతో చివరి ఆయకట్టు బీడువారేవి. ప్రధానంగా యాసంగిలో పంట భూములు నిరుపయోగంగానే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదుల, ఎస్సారెస్పీల ద్వారా సాగునీటిని పుష్కలంగా విడుదల చేసి చెరువులను పూర్తిస్థాయిలో నింపుతుండడంతో చివరి ఆయకట్టు వరకూ పంటలు సాగువుతున్నాయి. అయితే, పంట కాల్వలు జీర్ణావస్థకు చేరుకోవడంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందక రైతులు నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలో అధికారులు కాల్వలకు మరమ్మతులు చేసేందుకు సిద్ధం కావడంతో వచ్చే యాసంగిలో పంటలు సాగు చేసుకునే అవకాశం కలుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీరందితే చివరి ఆయకట్టులో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు.