నర్సంపేట, సెప్టెంబర్ 11: తెలంగాణలో ఎంతో ప్రజాదారణ పొందుతున్న సంక్షేమ పథకాలను ఆపేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌డ్డి అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు చెందిన 1148 మంది లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ బీజేపీ సర్కారు తెలంగాణ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు ఆందుతున్నాయని తెలిపారు. పలు కారణాల వల్ల కార్డులు రాని వారు మళ్లీ ఆఫ్‌లైన్ ద్వారా మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆపేందుకు కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని విమర్శించారు.
దసరా పండుగ అనంతరం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా సభలు నిర్వహించి, సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం రూ. 3 లక్షలు మంజూరు చేస్తామని వివరించారు. అదేవిధంగా నర్సంపేట పట్టణ అభివృద్ధిలో భాగంగా ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన రూ. 50 కోట్ల పనులకు సంబంధించిన అనుమతులు త్వరలోనే రానున్నట్లు తెలిపారు. ఇంకా అక్కడక్కడా మిగిలిపోయిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ గుంజి రజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, టీఆర్ఎస్ నాయకులు రాయిడీ రవీందర్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
పెద్దికి వినతిపత్రం అందజేత
విద్యార్థి ప్రజాసంఘాల నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్ది సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాల్లోని రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలు అతిక్రమించిన రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దిని కలిసిన వారిలో దళితరత్న కల్లపెల్లి ప్రణయ్‌దీప్, మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి విజయ్, కన్వీనర్, విద్యార్థి నాయకుడు సందీప్, సునీల్, హరీశ్, క్రాంతి పాల్గొన్నారు.