నర్సంపేటరూరల్/రాయపర్తి/గీసుగొండ/సంగెం/, సెప్టెంబర్ 11: మూడు రోజులుగా వర్షం జిల్లాను వదలడం లేదు. ఎడతెరిపేలకుండా వాన పడుతుండడంతో జనజీవనం స్తంభించింది. వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. చేలల్లో వర్షపునీరు నిలిచింది. చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతుండగా, వాగులు, వంకలు ఉధృతంగా ప్రశహిస్తున్నాయి. నర్సంపేట మండలంలోని మాదన్నపేట పెద్ద చెరువు ఆదివారం 6 ఫీట్ల మందంతో అలుగు పోస్తున్నది. మాదన్నపేట, గురిజాల, ముగ్దుంపురం, లక్నేపల్లి గ్రామాల శివారులోని లోలెవల్ కాజ్‌వేలను తాకుకుంటూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. రాయపర్తి మండలంలోని 39 జీపీల పరిధిలో వర్షాలకు పాత ఇండ్లు, ప్రహరీలు, ఇంటి గోడ లు దెబ్బతింటున్నాయి. పెర్కవేడుకు చెందిన వెన్ను కృష్ణమూర్తి, బురహాన్‌పల్లిలో ముంజాల యాదమ్మ, ఎం సంతోష్ ఇంటి గోడలు కూలిపోయాయి. ప్రభు త్వం ఆర్థిక సాయం అందించాలని బాధితులు కోరుతున్నారు. సంగెం మండలంలో ముసురు కారణంగా చేను చెలకలు తడిసి ముద్దయ్యాయి. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. గీసుగొండ మండలవ్యాప్తంగా వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. పశువులు, జీవాలు మేతకు ఇబ్బంది పడ్డాయి. వాగులు, వంకల్లో వరద నీరు చేరి పారుతున్నారు. చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. ముసురు కారణంగా పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.