సుబేదారి, ఆగస్టు 2 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ ఏం జరిగినా పోలీసులకు సమాచారం అందుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించడానికి పోలీసులకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో రూ. 585 కోట్ల నిధులతో 14 అంతస్తులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించిన విషయం తెలిసిందే.
వరంగల్ పోలీసు కమిషనరేట్‌కు అనుసంధానం
హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ను అనుసంధానం చేశారు. హైదరాబాద్ సెంటర్ పెద్ద పెద్ద స్క్రీన్లలో వరంగల్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఇందుకు వరంగల్ కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అధునీకరించారు.
నగరంలో నిఘా..
వరంగల్ నగరంలో ఇప్పటికే ప్రధాన జంక్షన్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటిని వాహనాల రాకపోకలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా వినియోగిస్తున్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో నగరంలోని ప్రధాన జంక్షన్లలో ఒక్కో జంక్షన్లో 15 నుంచి 20 సీసీ కెమెరాలను అమర్చుతున్నారు. పనిచేయని కెమెరాలను తీసివేసి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సింగరేణి నుంచి రూ.23 లక్షల నిధులు మంజూరయ్యాయి.
వరంగల్ కమిషనరేట్‌లో ప్రత్యేక టీం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆరు పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు, కమ్యూనికేషన్ సిస్టం ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 24 గంటలు ఇక్కడి నుంచి వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 45 పోలీసు స్టేషన్ల ఏరియాలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎక్కడైనా సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఇక్కడి నుంచి స్థానిక పోలీసులను అప్రమత్తం చేస్తారు. ఇప్పుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కమిషనరేట్ పరిధిలోని 45 పోలీసు స్టేషన్లను అనుసంధానం చేశారు. పర్యవేక్షణకోసం ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు, ఒక ఏఎస్సై, 8 మంది సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్‌ను నియమించారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై దాడులు, వివిధ సంఘనల్లో సమాచారం తెలుసుకుని వెంటనే స్థానిక పోలీసులను పంపించి తక్షణ సాయం అందిస్తారు. కమాండ్ కంట్రోల్ నిరంతర పర్యవేక్షణతో ఎక్కడైనా ఏదైనా నేరం జరిగిన వెంటనే సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించి పట్టుకుంటారు.
తొలివిడుత ఐదు పోలీస్ స్టేషన్లు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు తొలి విడుత ఐదు పోలీస్ స్టేషన్లు అనుసంధానం చేశారు. నగరంలో సుబేదారి, హనుమకొండ, మట్టెవాడ, రూరల్ ఏరియాలో నర్సంపేట, జనగామ పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేశారు. దశల వారీగా అన్ని పోలీసు స్టేషన్లను అనుసంధానం చేస్తారు.
ఐదు పోలీస్ స్టేషన్లు అనుసంధానం..
హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో శాంతి భద్రతల ప్రక్రియ మరింత పకడ్బందీగా ఉంటుంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సుబేదారి, మట్టెవాడ, హనుమకొండ, నర్సంపేట, జనగామ పోలీసు స్టేషన్లను అనుసంధానం చేశాం. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పర్యవేక్షణకోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎక్కడైన సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు అప్రమత్తమవుతారు. బాధితులకు తక్షణ సాయం అందుతుంది. నేరస్తులను కూడా పట్టుకోవడం సులభమవుతుంది.
– తరుణ్‌జోషి, వరంగల్ పోలీస్ కమిషనర్