నర్సంపేట, జూలై 16 : మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునర్నిర్మాణ పనులు చురుగ్గా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెరువుల పనులు పూర్తి చేశారు. జిల్లాలో 374 చెరువులు ఉండగా, 293 చెరువులకు మరమ్మతులు చేయించారు. దీంతో 30287 ఎకరాల ఆయకట్టు పెరిగింది. మొదటి విడుతలో 77, రెండో విడుతలో 79, మూడో విడుతలో 66, నాలుగో విడుతలో 71 చెరువులను అభివృద్ధి చేశారు. మొత్తం రూ.104.55 కోట్లు వెచ్చించారు. నర్సంపేట డివిజన్లోని 106 చెరువులు ఇందులో ఉన్నాయి. జిల్లాలో కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఒకటి నిండిన తర్వాత అలుగు నీరంతా మరొక చెరువులోకి వెళ్తుంది. దీంతో వర్షపు నీరు వృథాకాదు. కాగా, చెరువులు పూడిక మట్టితో నిండిపోయాయి. గత ప్రభుత్వాల కాలంలో మరమ్మతులకు నోచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులను అభివృద్ధి చేశారు. కట్టలు, తూములు, మత్తళ్లను పునర్నిర్మించగా, ఇప్పుడు జలకళను సంతరించుకున్నాయి. అలాగే, చెరువుల్లోని పూడికమట్టిని పొలాలకు తరలించడం వల్ల భూసారం కూడా పెరిగింది. ఇటీవల భారీ వర్షాలు కురిసినా ఎక్కడా చెరువుల కట్టలు తెగిన ఘటనలు జరుగలేదు. గత ప్రభుత్వాల కాలంలో వర్షాలు కురిస్తే చాలు పంట కాల్వలు మొదలుకుని, చెరువులకు గండ్లు పడేవి. మత్తళ్లు, తూముల లీకేజీలు అధికంగా జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా కనుమరుగయ్యాయి.
నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది.. కొండవీటి పావని, సర్పంచ్,తిమ్మరాయిన్ పహాడ్
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల అభివృద్ధి జరిగింది. కట్టలు, తూములు, మత్తళ్లకు మరమ్మతులు చేశారు. పూడిక మట్టిని తవ్వి రైతులు పొలాలకు తరలించుకున్నారు. దీంతో భూములు సారవంతంగా మారాయి. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చెరువులను పునర్నిర్మించడంతో ఇప్పుడు మేలు జరిగింది. భారీ వర్షాలు కురిసినా చెరువులకు ఎలాంటి ముప్పు ఉండడం లేదు.