వరంగల్, జూలై 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఐదురోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, గోదావరి వరదలతో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం హనుమకొండకు వచ్చారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ వీ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే చేయనున్నారు. గోదావరి తీరం మీదుగా భద్రాచలం దాకా వెళ్లి అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించి, తిరుగు ప్రయాణంలో ఏటూరునాగారంలో దిగనున్నారు. ఇక్కడ గోదావరి వరద ముంపు ప్రభావం ఎక్కువగా ఉన్న క్రమంలో పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తారు. ఇక్కడే ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించి, హైదరాబాద్ వెళ్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
వరద నష్టం పరిశీలనకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వచ్చారు. సీఎం కేసీఆర్ హనుమకొండకు వచ్చీరాగానే వరద ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించే ఏరియల్ సర్వేపై మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు. గోదావరి వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఏటూరునాగారంలో పరిస్థితిని తెలుసుకున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయ కార్యక్రమాలు, చర్యలపై సూచనలిచ్చారు. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండా ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్రావు, పీ కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, అరూరి రమేశ్, టీ రాజయ్య, బీ శంకర్‌నాయక్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జడ్పీ అధ్యక్షులు ఎం.సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ ఎస్.సుందర్‌రాజుయాదవ్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవారెడ్డి, సతీష్‌రెడ్డి, కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, బీ గోపి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, నగర కమిషనర్ ప్రావీణ్య, పాల్గొన్నారు.
ఏరియల్ సర్వే ఇలా..
సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం వరంగల్ నుంచి భద్రాచలం దాకా హెలీకాప్టర్‌లో ఏరియల్ సర్వే చేస్తారు. భద్రాచలంలో పర్యటించి, వరద ముంపు వల్ల సంభవించిన నష్టం, చేపడుతున్న సహాయక చర్యలపై అక్కడే ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తారు. అకడినుంచి ఏటూరునాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేస్తారు. ఏటూరునాగారంలో దిగి ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు. సహాయక చర్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించి హైదరాబాద్ వెళ్తారు.