వరంగల్, నవంబర్ 22 : కాలనీలలో కనీస వసతులు కల్పించాలని బల్దియా గ్రీవెన్స్‌లో పలువురు అధికారులకు విన్నవించారు. అనేక సమస్యలతో సహవాసం చేస్తున్నామని గోడు వెల్లబోసుకున్నారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఇన్చార్జి అదనపు కమిషనర్ విజయలక్ష్మి గ్రీవెన్స్ వినతులు స్వీకరించారు. రోడ్డు, డ్రైనేజీల నిర్మాణా లు, అక్రమ నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలు, పారిశుధ్యం, నల్లా లేకున్నా పన్ను మదింపు వంటి సమస్యలపై గ్రీవెన్స్ లో వినతులు వెల్లువెత్తాయి. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. 15వ డివిజన్ మొగిళిచర్ల గ్రామంలో రోడ్డుకు 3 ఫీట్ల ఎత్తులో డ్రైనేజీ నిర్మించడంతో మురుగునీరు డ్రైనేజీలోకి వెళ్లకుండా రోడ్లపై నిలుస్తోందని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వడ్డేపల్లి విజయపాల్ నగర్లో ఇంటి నంబర్ 2-7-1330 వరకు డ్రైనేజీ నిర్మాణం చేసి వదలడంతో పైనుంచి వచ్చిన ముగురు నీరు ఇంటి ముందు నిలుస్తోందని బాధితుడు వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశాడు. 29వ డివిజన్లోని రామన్నపేట కుంటి భద్రయ్య దేవస్థానానికి చెందిన స్థలాన్ని కొంత మంది కబ్జా చేస్తున్నారని, సర్వే నంబర్ 13లో భూమి కబ్జా చేసి 10 సర్వే నంబర్‌గా చూపి పర్మిషన్లు తీసుకోని నిర్మాణాలు చేస్తున్నారని వాటిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని వీరేందర్, సాత్విక్ ఫిర్యాదు చేశారు.
36వ డివిజన్ చింతల్లో ఇంటి నంబర్ 16-11-822లో నల్లా లేకున్నా తాగనీటి పన్ను రూ. 21,190 వచ్చిందని దానిని తొలగించాలని బాధితుడు కృష్ణమూర్తి గ్రీవెన్స్‌లో వాపోయాడు. దేశాయిపేటలో ఇంటి నంబర్ 11-23-1547ను రద్దు చేయాలని గతంలో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రద్దు చేయలేదని, అధికారులను అడిగితే సమాధానం చెప్పడం లేదని ఆడెపు కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. పద్మనగర్ సర్వే నంబర్ 10లోని హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేస్తున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరా రు. 49వ డివిజన్లోని రామకృష్ణాకాలనీ రోడ్ నంబర్ 4లో కనీస వసతులు లేవని, వెంటనే రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని కాలనీవాసులు గంగుల వెంకటేశ్వర్‌రెడ్డి వినతి పత్రం అందచేశాడు. ఎనుమాముల శివారు సర్వే నంబర్ 220/ఏ లోని తన సొంత స్థలం లో అనుమతులు లేకుండా ఏఎస్సై నిర్మాణాలు చేపడుతున్నారని ఎండీ. జుబేర్ అధికారులకు ఫిర్యాదు చేశా డు.
53వ డివిజన్ ఆదర్శనగర్‌లో కనీస వసతులు లేవ ని, కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నామని రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కాలనీవాసి రమేశ్‌కుమార్ వినతిపత్రం అందచేశాడు. 23వ డివిజన్లోని గౌతమి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని కాలనీవాసులు అధికారులను కోరారు. కాకతీయ కాలనీ ఫేజ్-2లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉంద ని, కాలువలు శుభ్రం చేయడం లేదని కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యుడు నర్సయ్య గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. మొత్తం 54 వినతులు రాగా టౌన్‌ప్లానింగ్ విభాగానికి 26, ఇంజినీరింగ్ 14, ప్రజారోగ్య విభాగానికి 7, పన్నుల విభాగానికి 7 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గ్రీవెన్స్‌లో చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, సిటీ ప్లానర్ వెంకన్న, పన్నుల అధికారి శాంతికుమార్, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్ యాదవ్, ఈఈలు, డీఈ, ఏసీపీలు పాల్గొన్నారు.