వరంగల్, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక అంశాలు భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సమితి(టీఎస్కాస్ట్) ఆధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నది. రూ.14.51 కోట్లతో కొత్తగా ఏడు ప్రాజెక్టులను మొదలుపెడుతుండగా ఇందులో వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్లో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు చేస్తున్నది. సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్), జవహర్లాల్ నెహ్రూ ఆరిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్ఎఫ్ఏయూ) సహకారంతో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటయ్యేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
ఏకైక సెంటర్..
మొదటినుంచి ఎడ్యుకేషన్ హబ్‌గా గుర్తింపు ఉన్న వరంగల్ నగరంలో రీజినల్ సైన్స్ సెంటర్ ఉన్నది. రాష్ట్రం మొత్తంలో ఇదొక్కటే సైన్స్ సెంటర్. పిల్లలకు పాఠశాల స్థాయిలోనే సైన్స్ ఆవిష్కరణలపై అవగాహన పెంచడం, వాటిని ఆచరణలోకి తెచ్చేలా ప్రోత్సహించే లక్ష్యంతో 1986లో కేంద్ర ప్రభుత్వం రీజినల్ సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది. శాస్త్ర, సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం వీటి ప్రధాన ఉద్దేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి అప్పుడే మూడు మంజూరయ్యాయి. వరంగల్, విజయవాడ, తిరుపతిలో వీటిని ఏర్పాటు చేసేలా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. సమైక్య ప్రభుత్వాలు వరంగల్‌లో సైన్స్ సెంటర్ నిర్మాణంపై నిర్లక్ష్యం వహించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ.5.87 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దీని నిర్మాణం పూర్తిచేసింది. పాఠ్యపుస్తకాల్లోని క్లిష్టమైన అంశాలను విద్యార్థులకు సులువుగా తెలియజేసే లక్ష్యంతో సైన్స్ సెంటర్‌ను నిర్మించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లోని మౌలిక అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించేలా రీజినల్ సైన్స్ సెంటర్లో ఎగ్జిబిట్లను ఏర్పాటు చేశారు. స్పేస్ సైన్స్, సోలార్ పవర్, 5డీ థియేటర్, ఎడ్యుకేషన్ త్రూ సాటిలైట్ హాల్, పర్యావరణ కాలుష్యం, మానవ శరీర నిర్మాణం మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎస్సీ-ఎస్టీ సెల్ ఏర్పాటవుతున్నది.
యువతకు ఉపాధిపై శిక్షణ
పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ఎనిమిది క్లస్టర్లను ఎంపిక చేసి అక్కడి యువతకు స్వయం ఉపాధి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే క్లస్టర్ల ఎంపిక పూర్తయ్యింది. పర్వతగిరి(వరంగల్), బెల్లంపల్లి(మంచిర్యాల), బోనకల్లు(ఖమ్మం), సారంగపూర్(నిర్మల్), శంకరపట్నం(కరీంనగర్) మండలాలను ఎస్సీ క్లస్టర్లుగా.. దమ్మపేట(భద్రాద్రి), భూపాలపల్లి(జేఎస్ భూపాలపల్లి), ఏటూరునాగారం(ములుగు) మండలాలను ఎస్టీ క్లస్టర్లుగా ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఈ మండలాల్లోని ఆ వర్గం యువతను స్వయంఉపాధి కల్పన దిశగా సిద్ధం చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇన్నోవేషన్ హబ్..
వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్లో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు గత డిసెంబర్లో ఆర్ఎస్సీకి ఇన్నోవేషన్ హబ్ మంజూరైంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజిమ్స్(ఎన్సీఎస్ఎమ్) దీన్ని మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సమితి(టీఎస్కాస్ట్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చొప్పున ఖర్చు చేసేలా ఈ ప్రాజెక్టు ఉంటుంది. రూ.1.60 కోట్లతో మూడేండ్లలో దీన్ని ఏర్పాటు చేస్తారు. డిస్కవరీ హాల్, ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్, ఐడియా ల్యాబ్, డిజైన్ స్టూడియోలను నిర్మిస్తారు. సృజనాత్మక, సైన్స్ ఆవిష్కరణలు, సంపద్రాయ సైన్స్‌లోని ఆలోచనలకు కార్యరూపం దాల్చేలా ఇన్నోవేషన్ హబ్ ఉండనుంది.