వరంగల్ చౌరస్తా, నవంబర్ 20: వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. కనీస మద్దతు ధర చట్టాన్ని రూపొందించి రైతులపై తమ బాధ్యతను చాటుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు రాచర్ల బాలరాజు, జిల్లా కార్యదర్శి ఆరెల్లి కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు నాయకులు శనివారం వరంగల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అహంకారంతో రైతులు, వ్యవసాయాన్ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేసి, సుమారు 700 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ సంస్థలకు దోచిపెట్టే ప్రయత్నంలో కేంద్రం విఫలమైందని దుయ్యబట్టారు. రైతులు కన్నెర్ర చేస్తే ఏ ప్రభుత్వం నిలువదని మరోసారి రుజువైందన్నారు. మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు స్వామినాథన్ కమిషన్ సిపారసులను అమలు చేస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. నేటికీ ఆ ఈసెత్తడం లేదని ఎద్దేవా చేశారు.
‘కార్పొరేట్’కు దోచిపెట్టే యత్నం
ప్రభుత్వ శాఖలను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అమ్మకానికి పెడుతున్నారని రాచర్ల బాలరాజు, ఆరెల్లి కృష్ణ ధ్వజమెత్తారు. సుమారు 44 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి దేశంలోని కార్మిక వర్గాన్ని మోదీ సర్కారు అదోగతిపాలు చేస్తున్నదని, వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగాన్ని సైతం ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం సవరణల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. నకిలీ విత్తనాలు, మందులు, అనావృష్టి, అతివృష్టి మూలంగా నష్టాలపాలైన రైతులను ఆదుకోవడానికి రుణ విముక్తి చట్టం రూపొందించి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్, కానుగుల రంజిత్‌కుమార్, మాపవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోట్వేశ్వర్రావు, బాషిపాక అశోక్, హరిబాబు, సుమన్, కృష్ణ, ఎండీ అక్బర్, సంపత్ పాల్గొన్నారు.
రుణ విముక్తి చట్టం చేయాలి
నర్సంపేట: సాగు చట్టాల రద్దుతోపాటు మద్దతు ధర, రుణ విముక్తి చట్టం చేయాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దారపు రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నర్సంపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ చట్టాల రద్దు ప్రజా పోరాట విజయమన్నారు. రైతు ఉద్యమం ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదన్నారు. ఇదే స్ఫూర్తితో రైతులు పంట ఉత్పత్తులకు మద్దతు ధర వచ్చేలా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు సాధించే వరకూ పట్టుదలతో ముందుకు సాగాలని కోరారు. ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి సాగుపై ఆంక్షలు ఎత్తి వేయాలన్నారు.