వరంగల్, మే 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేందుకు గ్రేటర్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రతి ఇంటా ఆరు మొక్కలు పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. 8వ విడుత హరితహారం కార్యక్రమానికి ఇప్పటి నుంచే గ్రేటర్ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ ఏడాది గ్రేటర్‌కు ప్రభుత్వం 16 లక్షల మొక్కలు టార్గెట్‌గా నిర్ణయించింది. గ్రేటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 17 నర్సరీలతో పాటు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన రెండు నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. పూలు, పండ్ల మొక్కలను ఎక్కువగా పెంచుతున్నట్లు గ్రేటర్ హార్టికల్చర్ వింగ్ అధికారులు తెలిపారు.
2.40 లక్షల గృహాల్లో మొక్కల పంపిణీ
హరితహారంలో ప్రతి ఇంటా ఆరు మొక్కలు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో బల్దియా అడుగులు వేస్తోంది. గ్రేటర్ పరిధిలోని సుమారు 2.40 లక్షల గృహాల్లోని ప్రతి ఇంటా మొక్కలు పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇంటింటా పూలు, పండ్లు, అవెన్యూ మొక్కలు అందించనున్నారు. గతంలో చేసిన తప్పులు చేయకుండా ఈ సారి జాగ్రత్తగా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రజల కోరిన మొక్కలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నాలుగు డివిజన్లకు ఒక ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి ఇంటింటా మొక్కలు పంపిణీ చేసేలా కార్యాచరణ చేశారు. మొక్కలను ఎక్కడ డంప్ చేయకుండా నేరుగా నర్సరీ నుంచి ట్రాక్టర్ల ద్వారా అందించనున్నారు.
అందుబాటులో 15 లక్షల మొక్కలు..
గ్రేటర్ పరిధిలోని 17 నర్సరీలతోపాటు కుడాకు చెందిన 2 నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. ఇప్పటికే సుమారు 15 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరో మూడు నెలల్లో 5 లక్షల మొక్కలు చేతికి వస్తాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ టార్గెట్‌కు సరిపోయే మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.
పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేస్తాం
ఎనిమిదో విడుత హరితహారంలో ప్రజలకు కావాల్సిన మొక్కలు పంపిణీ చేస్తాం. పూలు, పండ్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు కాలనీ కమిటీల సహకారంలో అవెన్యూ ప్లాంటేషన్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రతి ఇంటా ఆరు మొక్కలు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నాం, మల్లె, గులాబీ, కనకాంబరం, నిమ్మ, జామ, చింత, సీతాఫలం, కరివేపాకు మొక్కలను అందించేందుకు కార్యాచరణ రూపొందించాం.
– ప్రిసిల్లా, హార్టికల్చర్ అధికారి