గిర్మాజీపేట, మే 6: హార్ట్ ఆపరేషన్ చేయించిన మహేశ్‌బాబు ఫౌండేషన్ బాలుడికి పునర్జన్మనిచ్చింది. తెరపైనే కాదు.. తెరవెనుక కూడా రియల్ హీరో అనిపించుకున్నారు మహేశ్‌బాబు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ గిర్మాజీపేటకు చెందిన గద్దల రవి-భానురేఖ దంపతులకు మూడున్నర సంవత్సరాల బాబు ఉన్నాడు. రవి వృత్తి రీత్యా జీడబ్ల్యూఎంసీలో పారిశుధ్య కార్మికుడు. పుట్టిన ఆరు నెలలకే బాబు అనారోగ్యం బారిన పడడంతో తల్లిదండ్రులు దవాఖానకు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. బాలుడి గుండెలో రంధ్రం ఉందని వైద్యులు నిర్ధారించారు. బాబుకు మూడేండ్ల తర్వాత ఆపరేషన్ చేయించాలని సూచించారు. గత ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని పిల్లల దవాఖానకు తీసుకెళ్లగా ఆపరేషన్‌కు రూ. 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. రెక్కాడితేగాని డొక్కాడని రవికి ఏం చేయాలో తోచలేదు.
అయోమయంలో ఉన్న అతడు మహేశ్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గందె నవీన్‌ను సంప్రదించాడు. వెంటనే స్పందించిన అతడు మహేశ్‌బాబు ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్‌లోని రెయిన్బో చిల్డ్రెన్స్ హాస్పిటల్లో చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నట్లు తెలిపాడు. బాలుడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఫౌండేషన్ ప్రతినిధులను సంప్రదించగా, వారు గత ఏప్రిల్ 12న సాయంత్రం బాబును హాస్పిటల్లో చేర్పించారు. 13వ తేదీన ఆపరేషన్ చేయించి 15న డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. కాగా, శుక్రవారం సాయంత్రం బాబు తల్లిదండ్రులు తన బిడ్డకు పునర్జన్మనిచ్చిన మహేశ్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, మహేశ్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గందె నవీన్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడిచెర్ల ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి తత్తరి రమేశ్, సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.