వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 3: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే.. ఆ కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజా వైద్యానికి పెద్దపేట వేస్తున్నారు. ముఖ్యంగా ప్రసూతి వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మహిళా ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ప్రసూతి వైద్య సేవలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అనేక సౌకర్యాలు కల్పిస్తున్నది. అంగన్వాడీలను బలోపేతం చేసింది. మహిళ గర్భం దాల్చిన మూడు నెలల నుంచే పౌష్టికాహారం, వైద్యుల పర్యవేక్షణ ఉండేలా కృషి చేస్తున్నది. ప్రసూతి వైద్య సేవలు అందించేందుకు సర్కారు దవాఖానల్లో అవసరాలకు తగ్గట్టు అత్యాధునికి హంగులతో కార్పొరేట్ వైద్యశాలకు దీటుగా భవనాలను సైతం నిర్మించింది. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా అధికారులు సైతం భవన నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనే కాకుండా ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిధిలోని మహిళలకు మాతృత్వాన్ని అందిస్తున్న సీకేఎం దవాఖాన ‘అమ్మఒడి’ అయి అక్కున చేర్చుకుంటున్నది. సుమారు ఆరు దశాబ్దాలకు పైగా మహిళలకు ప్రసూతి సేవలు అందిస్తూ ఎంతో మంది ప్రముఖుల జన్మస్థలంగా నిలిచింది.
శిశువు ఆరోగ్యం కోసం ‘కిట్’
పుట్టిన శిశువుకు ప్రాథమిక దశలో ఎలాంటి వైరస్ ప్రభావం పడకుండా, సామాన్య, పేద కుటుంబంలో పుట్టిన పిల్లలకు సైతం అన్ని రకాల అవసరాలకు సరిపడేలా ప్రభుత్వం కేసీఆర్ కిట్ అందిస్తున్నది. శిశువు ఆరోగ్యాన్ని ప్రాథమిక దశలోనే కాపాడేందుకు అవసరమయ్యే వస్తువులను అందులో పొందుపరిచారు. 15 రకాలతో కూడిన 20 వస్తువులను కిట్ ద్వారా అందిస్తున్నారు. దోమతెరతో కూడిన నిద్రించే పడక, పిల్లల డ్రెస్‌లు (రెండు), టవళ్లు(రెండు), న్యాప్కిన్స్ (రెండు), జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్, 100 ఎంఎల్ జాన్సన్ అండ్ జాన్సన్ షాంపో, 100ఎంఎల్ బాడీ మసాజ్ ఆయిల్, జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బులు(రెండు), సబ్బు పెట్టె, ఆట వస్తువు (గిలక), తల్లికి చీరలు(రెండు), తల్లికి బాత్ సోప్, ప్లాస్టిక్ బుట్ట, కిట్ బ్యాగ్, బేబీ మ్యాకింతోష్తో కూడిన కిట్ అందిస్తున్నారు.
వైద్య పరీక్షలకు 102 వాహనం..
మహిళా గర్భం దాల్చిన మూడో నెల నుంచి అంగన్వాడీ వర్కర్ల పర్యవేక్షణ ఉంటుంది. వైద్య పరీక్షల కోసం గర్భిణులను దవాఖానకు తరలించేందుకు ప్రత్యేకంగా 102 వాహన సేవలను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వైద్యుల సూచన మేరకు వైద్య పరీక్షలు అవసరమైన సందర్భాల్లో మహిళలు 102 సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ప్రతి గర్భిణి తన గర్భస్థ, శిశువు వ్యాక్సినేషన్ కాలంలో గరిష్ఠంగా ఏడు సార్లు ఉచితంగా 102 వాహన సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ముందుగా చేయాల్సిందల్లా 102కు ఫోన్ చేసి తమ పేరును నమోదు చేసుకొని, పూర్తి వివరాలు తెలియజేయాలి. ఏరోజు దవాఖానాకు వెళ్లాలనున్నారో తెలుపాలి. మహిళ ఇచ్చిన ఫోన్ నంబర్‌కు ముందస్తు సమాచారాన్ని అందజేసి వాహనం చేరుకునే సమయాన్ని ముందుగానే తెలియజేస్తారు. గర్భిణి దవాఖానాకు చేరుకొని వైద్య సేవలు పొందిన తదుపరి తిరిగి ఇంటికి క్షేమంగా చేర్చుతారు. ప్రసవం తదుపరి ఇంటికి చేర్చే సమయంలో వాహనంలో తల్లి, శిశవువుతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు సహాయకులుగా 102 వాహనంలో కలిసి ప్రయాణించేందుకు అనుమతిస్తారు. 102 వాహన సేవలను దూరంతో సంబంధం లేకుండా వినియోగించుకోవచ్చు. ప్రసుత్తం వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగానే కాకుండా అవసరం, సేవలు పొందుతున్న వారి సంఖ్యను బట్టి అధికారుల ప్రత్యేక అనుమతులతో చుట్టుపక్కల జిల్లాలకు సైతం సేవలు అందిస్తున్నారు.