శాయంపేట, ఏప్రిల్ 8: మండలంలోని మాందారిపేట శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి ఏరేందుకు కూలీలతో వెళ్తున్న గూడ్స్(ట్రాలీ) వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందగా, మరో పది మందికి పైగా గాయాలయ్యాయి. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తిపాక గ్రామం నుంచి రెండు నెలలుగా మిర్చి ఏ రేందుకు మహిళా కూలీలు భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం అంకుషాపూర్‌కు గూడ్స్(ట్రాలీ) వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మొగుళ్లపల్లి మండలం అకుషాపురానికి చెందిన వాహనంలో నలభై మంది ఎక్కారు. కొందరు మధ్యలో కూర్చోగా, చుట్టూ మరికొందరు నిలబడి ఉన్నారు. ఇందులో పత్తిపాక వారితోపాటు మైలారానికి చెందిన ఇద్దరు మహిళలు ఎక్కారు. 5 గంటలకు వాహనం బయలుదేరి మాందారిపేట దాటి కేజీబీవీ మలుపు వద్దకు చేరుకోగానే పరకాల నుంచి వస్తున్న లారీ ముందున్న మరో లారీని ఓవర్టేక్ చేస్తూ వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది.
దీంతో కుడివైపు నిలబడి ఉన్న మహిళల చేతులు తెగిపోయి .. తలలు ఛిద్రమై బీతావహ పరిస్థితి నెలకొంది. మిగిలిన వారంతా వాహనం దిగి పరుగులు పెట్టారు. తమ వారిని చూసి రోదిస్తూ సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించినా ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో కొందరు ప్రాణాలు విడిచినట్టు ప్రత్యక్ష సాక్షులు వాపోయారు. బాబు రేణుక(45), పూల మంజుల(47) అక్కడికక్కడే మృతి చెందగా, దండెబోయిన విమల(45), చల్లా ఐలుకొమురమ్మ (50)ను ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కొ డిమాల సరోజన, చింతల రాధ, మేకల లక్ష్మి, సూర్యబోయిన రేణుకు, జక్కుల ఐలమ్మ, గీరబోయిన ఓదెమ్మలను ఆస్పత్రికి తరలించారు. వీరిలో సరోజన, రాధమ్మల కుడి చేతులు తెగిపోయాయి. రాధమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మరికొంత మంది మైలారం, శాయంపేట ప్రాంతాల్లో డాక్టర్ల వద్దకు వెళ్లి ప్రాథమిక చికిత్స పొందారు. ఘటనా స్థలాన్ని పరకాల ఏసీపీ శివరామయ్య, ఎస్సై వీరభద్రారావు సందర్శించి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు పట్టుకునే పనిలో ఉన్నారు. మృతురాలు విమల భర్త కొమురయ్య ఫి ర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇమ్మిడి వీరభద్రారావు తెలిపారు. పత్తిపాకలో మృతుల కుటుంబాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పరామర్శించా రు. పూలమాల వేసి నివాళులర్పించారు. రూ.లక్ష ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియాను అందజేశారు.
పేద కుటుంబాల్లో విషాదం..
ప్రమాదంలో మృతి చెందిన వారంతా పేద కుటుంబాలే. మిర్చి ఏరేందుకు వెళ్తే రోజుకు రూ. 200లు కూలీ ఇస్తున్నా రు. వీటికోసమే అంతదూరం వెళ్తూ ప్రాణాలను పోగొట్టుకోవడం విషాదాన్ని నింపింది. వీరిలో మృతి చెందిన పూల మం జులకు భర్త శ్రీనివాస్, ముగ్గురు పిల్లలు న్నారు. దండెబోయిన విమలకు భర్త కొమురయ్య, ఇద్దరు పిల్లలున్నారు. బాబు రేణుకకు ఇద్దరు పిల్లలు. చల్లా ఐలుకొమురమ్మకు భర్త సాం బయ్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మహిళలు పనుల కోసం వెళ్తూ ప్రాణాలను కోల్పోవడం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. మధ్యాహ్నం తర్వాత పోస్టుమార్టం అంతరం మృతదేహాలను పత్తిపాకలోని వారి స్వగృహా లకు తరలించారు. పక్కపక్కనే ఇండ్లు కావడంతో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
బాధితులకు ఎంజీఎంలో చికిత్స..
వరంగల్ చౌరస్తా: రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిం తల రాధ(50), కొమిడల సరోజన (60), మేకల లక్ష్మి (55) ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వారిలో మే కల లక్ష్మి, సరోజనల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యు లు తెలిపారు. బాధితులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆర్జీ హన్మంతు, ఆర్డీవో వాసుచంద్ర పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. అనంతరం మార్చురీ వద్దకు చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు.
బతుకుత అనుకోలే..- గందెసిరి సూరమ్మ, పత్తిపాక
ఇరవై రోజులుగా మిర్చి ఏరేందుకు మేదరమెట్లకు పోతున్న.. రూ.260 ఇస్తున్నారు. అందులో రూ.60 ట్రాలీ ఆయన తీసుకుంటడు. శుక్రవారం ఉదయం 5 గంటలకు బయలు దేరినం. 5.40 కి ఇలా అయింది. డ్రైవర్ మాందారిపేట వద్ద ఎదురుగా లారీ వస్తే పక్కకు పోయిండు. అయినా లారీ పైకి వచ్చి కొట్టుకుంటూ పోయింది. మొత్తం నలభై మందికిపైగా వాహనంలో ఉన్నం. ఒక్కోరోజు అంత మందిమి పోము. వచ్చినోళ్లను కాదు అనకుండా తీసుకెళ్తున్నారు. చేతులు తెగినోళ్లు మా మీద పడుతూనే ఉన్నారు. ఫస్టు పూల మంజుల, తర్వాత విమల పడ్డారు. రక్తం పడడంతో భయపడ్డాం. అందరం కిందకు దిగి పరుగెత్తినం. అక్కడే ఇద్దరు సచ్చిపోయిండ్లు. సరోజనకు చేయి పోయింది. విమల కొట్టుకుంటూ మా ముందే సచ్చిపోయింది. గంట పాటు ఎవరు రాలే. నేను బతుకుత అని అనుకోలేదు. దేవుడి దయతో బతికి బయట పడ్డ.