గీసుగొండ, ఏప్రిల్ 8: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో రోజుకు కనీసం 150 మంది కూలీలకు పనులు కల్పించాలని, సంఖ్య తగ్గితే చర్యలు తప్పవని డీఆర్డీవో సంపత్రావు హెచ్చరించారు. మండలంలోని శాయంపేట, ఊకల్ గ్రామాల్లో కూలీలు చేస్తున్న ఈజీఎస్ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ శాయంపేటలో 85 మంది కూలీలు మాత్రమే పనులు చేస్తున్నారని, మిగతా వారు ఎందుకు పనులకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. 150 మందికి తగ్గకుండా పనులు చేయించాలని సూచించారు. ఉపాధి పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉదయం 7 గంటలకే పనులకు రావాలని ఊకల్ గ్రామంలో కూలీలకు డీఆర్డీవో సంపత్రావు సూచించారు. ఆడ, మగ తేడా లేకుండా అందరికీ సమాన వేతనాలు వస్తాయన్నారు. అనంతరం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కార్యదర్శులు, సర్పంచ్లు సమన్వయంతో కొత్త పనులను గుర్తించాలని డీఆర్డీవో సూచించారు. పనిదినాలు తక్కువ ఉన్న కార్యదర్శులకు మెమోలు జారీ చేస్తామన్నారు. ఇప్పటికే పలువురికి మెమోలను జారీ చేశామని గుర్తుచేశారు. ఎంపీడీవో, ఏపీవో గ్రామాల్లో పర్యటించి కూలీల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కూలీల సంఖ్యను పెంచే విషయంలో మండలస్థాయి అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తున్నదని, మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సౌజన్య, ఎంపీడీవో రమేశ్, ఏపీవో మోహన్రావు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.