వర్ధన్నపేట/రాయపర్తి, ఏప్రిల్ 7: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా విద్యాశాఖ అధికారి డీ వాసంతి అన్నారు. ఇందుకోసమే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, స్కూళ్లలో సకల వసతులు కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. వర్ధన్నపేట పట్టణంలోని ఫిరంగిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో రంగయ్య, ఉపాధ్యాయులతో సమీక్షించారు. అనంతరం పాఠశాల ఆవరణ, తరగతి గదులను పరిశీలించి పాఠశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎస్ఎంసీ, ఉపాధ్యాయులతో చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరంలో వర్ధన్నపేట ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధించనున్నట్లు డీఈవో తెలిపారు.
కార్యక్రమంలో ఎంఈవో రంగయ్య, హెచ్ఎంలు రమేశ్, ఇక్బాల్, ఎస్ఎంసీ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే, డీఈవో రాయపర్తి మండలంలోని కొత్తూరు జడ్పీఎస్ఎస్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, క్రీడా మైదానాలు, వంట గదులు, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల వసతిని పరిశీలించారు. అనంతరం పీఎస్ హెచ్ఎం శేషమ్మ, ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం ఆనందకుమార్, ఎంఈవో నోముల రంగయ్యకు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా పదో తరగతి విద్యార్థులకు పరీక్ష విధానం, మార్కులు, పరీక్ష పత్రాలు, సిలబస్‌లో చేసిన మార్పులు, చేర్పులపై ఆమె సూచనలు చేశారు. ఆమె వెంట జిల్లా నోడల్ ఆఫీసర్ గారె కృష్ణమూర్తి, మండల ప్రత్యేకాధికారి నరేశ్‌కుమార్‌నాయుడు, సర్పంచ్ కందికట్ల స్వామి, ఎస్ఎంసీ చైర్మన్లు మాలోత్ వసుందర్నాయక్, మందాడి సుదర్శన్‌రెడ్డి, వడ్డె సమ్మయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.
అలంఖానిపేటలో సమీక్ష
నెక్కొండ: అలంకానిపేట ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీ రవి, హైస్కూల్ హెచ్ఎం జ్యోతిలక్ష్మి, ఏఈ రాజ్‌కుమార్ తదితరులు చర్చించారు. పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని సర్పంచ్ కోరారు. వారి వెంట ఎంపీటీసీ కర్పూరపు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటుక సోమయ్య, ఎస్ఎంసీ చైర్మన్ రాగిరి కుమారస్వామి, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.