పోచమ్మమైదాన్, జనవరి 30: వరంగల్ మండలంలోని పలు రేషన్‌షాపుల్లో అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో 87 రేషన్‌షాపులు ఉండగా, కొన్ని షాపులకు ఇన్చార్జిలు కొనసాగుతున్నారు. రేషన్‌షాపులపై సివిల్ సప్లయ్, తూనికలు, కొలతల శాఖ అధికారుల నిఘా కొరవడడంతో వినియోగదారులు నష్టపోతున్నారు. ఇటీవల ఎల్బీనగర్లోని పలు రేషన్ షాపుల డీలర్లు సరిగా పని చేయడం లేదని కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషితో పాటు ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. 237, 313 నంబర్ గల రేషన్‌షాపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమయపాలన పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే, కొత్తవాడ, ఆటోనగర్, డాక్టర్స్‌కాలనీ ప్రాంతాల్లో కూడా రేషన్‌డీలర్లు ఇష్టానుసారంగా బియ్యం పంపిణీ చేస్తున్నారని కార్డుదారులు చెబుతున్నారు. కాశీబుగ్గ తిలక్‌రోడ్డులోని ఆకుల కిశోర్‌కు సంబంధించిన రేషన్‌షాపులో ఇటీవల రాత్రి సమయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టగా, 23 క్వింటాళ్ల బియ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే, ఎల్బీనగర్లో ఇన్చార్జి నిర్వహిస్తున్న మరో రేషన్‌షాపులో తనిఖీ చేయగా, ఏడు క్వింటాళ్ల బియ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి, కేసులు నమోదు చేశారు. ఇదే క్రమంలో ఎల్బీనగర్, కాశీబుగ్గలోని పలు రేషన్‌షాపుల్లో తనిఖీలు చేపడితే ఎక్కువగా ఉన్న బియ్యం నిల్వలు బయటపడే అవకాశం ఉందని లబ్ధిదారులు అంటున్నారు.
అడ్రస్ లేని అధికారులు..!
ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న బియ్యం తూకంలో రేషన్ షాపుల నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు చాలా రేషన్‌షాపుల్లో ఇదే దందా కొనసాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు లేకపోవడంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి తూకంలో ఒకటి నుంచి రెండు కిలోల వరకు కాంటా కొడుతున్నారని కార్డుదారులు చెబుతున్నారు. కొంతమంది డీలర్లు సరైన కాంటాలు ఏర్పాటు చేయకపోవడం, పాత బాట్లను ఉపయోగించడం, నంబర్‌లేని బాట్లు వాడడం, బస్తా, ప్లేట్లను కలిపి బియ్యాన్ని తూకం వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే.. సివిల్ సప్లయ్ గోదాంలోనే తక్కువగా తూకం వేస్తున్నారని, దీంతో తాము కూడా వినియోగదారులకు కొంతమేర బియ్యాన్ని తక్కువగా ఇవ్వక తప్పడం లేదని డీలర్లు చెబుతుండడం కొసమెరుపు.