వరంగల్ చౌరస్తా : ఆర్థిక ఇబ్బందుల కారణంగా బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య(Suicide attempt) చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు కాపాడిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ మట్టేవాడ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లమ్మ బజార్‌లోని ఆదర్శ కాలనీలో నివాసముంటున్న కట్కోజు శివ కుమార్ (24) స్వర్ణకార పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుధవారం ఉదయం సుమారు 6గంటల సమయంలో తన నివాసం ఉంటున్న భవనం పై నుండి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
విషయం గ్రహించిన స్థానికులు డయల్ 100 ద్వారా స్థానిక మట్టేవాడ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, ఘటనా స్థలానికి చేరుకున్న బీట్ కానిస్టేబుల్స్ నరేష్, వేణుగోపాల్ బిల్డింగ్ పై అంచున నిలబడి వున్న వ్యక్తిని గుర్తించి స్థానికుల సహకారంతో సురక్షింతంగా కిందకి దించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చాకచక్యంగా వ్యవహరించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన బీట్ కానిస్టేబుల్స్‌ను పోలీసు అధికారులు అభినందించారు.