కాశీబుగ్గ, జూన్16: అంతర్జాతీయ మోసగాళ్ల ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. జేసీబీలు, టిప్పర్లు, ప్రొక్లెయినర్లు, కార్లను ఫైనాన్షియల్ ముసుగులో మోసపూరితంగా తీసుకువెళ్లి విదేశాలకు అమ్ముతున్న దశరథ్ ముఠా గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం మట్టెవాడ పోలీస్ స్టేషన్లో సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని తుర్కయాంజల్ గ్రామానికి చెందిన వరికుప్పల దశరథం, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వసంతనగర్‌కు చెందిన దుర్గం సందాన్, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం జగద్గిరిగుట్టకు చెందిన కౌశెట్టి రాకేశ్, హైదరాబాద్ ఓల్డ్‌సిటీ సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ జాబీర్ కలిసి కొన్నేళ్లుగా తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో చోరీలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఆర్థిక ఇబ్బందులతో పెద్ద పెద్ద వాహనాలు అమ్మకానికి పెట్టిన యజమానుల నుంచి కొని వాటికి సంబంధించిన ఫైనాన్స్ మిగతా వాయిదాలు కడతామని నమ్మించి మోసపూరితంగా ఇతరులకు అమ్ముతున్నారు.
అలాగే స్క్రాప్‌కు లేదా ముంబైలోని కొన్ని ముఠాల ద్వారా విదేశాలకు ఎగుమతులు చేస్తూ గతంలో హైదరాబాద్‌లోని పోలీసులకు పట్టుబడి సుమారు 16 కేసుల్లో జైలు జీవితం అనుభవించారు. 2023 సంవత్సరం నుంచి వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్, నల్గొండ జిల్లాలోని చింతపల్లి పోలీస్ స్టేషన్, తిప్పర్తి పోలీసు స్టేషన్, సైబరాబాద్ పరిధిలో అమనగల్ పోలీస్ స్టేషన్, మోకిలా పోలీస్ స్టేషన్లలో మళ్లీ సుమారు రూ. నాలుగున్నర కోట్ల విలువైన వాహనాలను మోసపూరితంగా తీసుకొని వాటిని స్క్రాప్‌కు, లేదా ఇతర విదేశాలకు ఎగుమతి చేయగా వారిని మట్టెవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిపై 12 దొంగతనాలు, 23 వాహనాల అపహరణ కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.30లక్షల ఇన్నోవా క్రిస్టి, రూ.40లక్షల విలువైన నాలుగు స్విఫ్ట్ డిజైర్ కార్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, సీఐ తుమ్మ గోపి, ఎస్సై కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.